ఓవైసీ కోటపై కాంగ్రెస్ గురి: అభ్యర్థిగా అజరుద్దీన్ పేరు పరిశీలన

By Nagaraju penumalaFirst Published Mar 4, 2019, 6:09 PM IST
Highlights


అజహరుద్దీన్ ను బరిలోకి దించితే క్రికెటర్ గా యూత్ లో ఫాలోయింగ్ ఉండటంతోపాటు ముస్లిం మైనారిటీల ఓట్లు పడే అవకాశం ఉంది దాంతో అసదుద్దీన్ వరుస విజయాలకు బ్రేక్ లు వేయోచ్చని ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది. హైదరాబాద్ లోక్ సభ ఎంఐఎం పార్టీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు. 

హైదరాబాద్: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ గడ్డపై రసవత్తర పోరు నడవబోతుందా..?తనకు హవాకు అడ్డేలేదని భావిస్తున్న ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి చెక్ పెట్టాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోందా..?ఓవైసీని ఢీకొట్టే అభ్యర్థిని బరిలో దించేందుకు కసరత్తు చేస్తోందా..?

క్రికెటర్ గా ఒంటి చేత్తో భారతజట్టును గెలిపించిన ముహమ్మద్ అజహరుద్దీన్ హైదరాబాద్ పార్లమెంట్ ను గెలిపించి కాంగ్రెస్ ఖాతాలో వేస్తారా..?కాంగ్రెస్ ఆశలను అజహరుద్దీన్ నిజం చేస్తారా..?అసదుద్దీన్ ఓవైసీని ఓడించేందుకు కాంగ్రెస్ వేసిన ప్లాన్ వర్కవుట్ అవుతుందా ఇవే హైదరాబాద్ లో ప్రతీ ఒక్కరి నోట వినిపిస్తున్న మాటలు. చర్చకు వస్తున్న అంశాలు. 

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మూడు పర్యాయాలుగా హైదరాబాద్  లోక్ సభ నుంచి విజయదుందుభి మోగిస్తున్నారు. ముస్లిం మైనారిటీ ఓట్లు కీలకంగా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండటంతో ఆయన గెలుపుకు ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. అదే అంశాన్ని ఇప్పుడు కాంగ్రెస్ కూడా పరిగణలోకి తీసుకుంది. 

అజహరుద్దీన్ ను బరిలోకి దించితే క్రికెటర్ గా యూత్ లో ఫాలోయింగ్ ఉండటంతోపాటు ముస్లిం మైనారిటీల ఓట్లు పడే అవకాశం ఉంది దాంతో అసదుద్దీన్ వరుస విజయాలకు బ్రేక్ లు వేయోచ్చని ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది. హైదరాబాద్ లోక్ సభ ఎంఐఎం పార్టీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు. 

1984 లోక్ సభ నుంచి 2014 వరకు ఎంఐఎం పార్టీ వరుసగా విజయాలు సాధిస్తోంది. 1984లో అసదుద్దీన్ ఓవైసీ తండ్రి సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీ గెలుపొంది ఎనిమిదో పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1989లో ఏఐఎంఐఎం పార్టీ తరపున పోటీ చేసి రెండోసారి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. 

1984 నుంచి 1999 ఎన్నికల వరకు ఆయన వరుస విజయాలు సాధించారు. ఒకసారి స్వతంత్ర అభ్యర్తిగా ఐదుసార్లు ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా గెలుపొందుతూ హైదరాబాద్ ను ఎంఐఎం పార్టీ కంచుకోటగా మార్చేశారు. అదే కంచుకోట నుంచి 2004 ఎన్నికల్లో ఆయన తనయుడు అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేసి గెలుపొందారు. 

అసదుద్దీన్ ఓవైసీ 2004, 2009, 2014 ఎన్నికల్లో గెలుపొంది హాట్రిక్ విజయం సాధించారు. అంతేకాదు ఎన్నికల్లో తన ఓటింగ్ శాతం పెంచుకుంటూ వస్తున్నారు. ఓవైసీ కుటుంబానికి కోటగా ఉన్న హైదరాబాద్ లో విజయకేతనం ఎగురవెయ్యాలని జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీలతోపాటు ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు కూడా ప్రయత్నించాయి. 

కానీ ఇప్పటి వరకు ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ఈసారి మాత్రం చరిత్ర తిరగరాయాలని కాంగ్రెస్ పార్టీ భారీ వ్యూహంతో ముందుకు వెళ్తోంది. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అజహరుద్దీన్ ను బరిలోకి దించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న అజహరుద్దీన్ తెలంగాణ రాజకీయాలు కొత్తేనని చెప్పుకోవాలి. 

ఆయన ఇప్పటి వరకు తెలంగాణలో పోటీ చెయ్యలేదు. క్రికెటర్ కు వీడ్కోలు పలికిన తర్వాత 2009 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2014 లోక్ సభ ఎన్నికల్లో రాజస్థాన్ లోని టోంక్‌-సవాయ్‌ మాధోపూర్‌ లోక్ సభ స్థానం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 

ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీకి అజహర్ గట్టి పోటీ ఇస్తారని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇకపోతే అజహరుద్దీన్ కు టీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. హైదరాబాద్ పార్లమెంట్ విషయంలో ఎంఐఎం పార్టీకి టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. 

మిగిలిన పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తోంది. గత ఎన్నికల్లో 17 పార్లమెంట్ స్థానాలకు గానూ టీఆర్ఎస్ పార్టీ 11 స్థానాలు గెలుపొందగా, కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలు గెలుపొందింది. టీడీపీ, వైసీపీ, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కో స్థానంలో విజయం సాధించాయి. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చెయ్యాలని భావిస్తోంది. 

అలాగే బీజేపీ కూడా అన్ని పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందాలని చూస్తోంది. అజహరుద్దీన్ గతంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చెయ్యాలని భావించారు. అయితే కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ ఉండటంతో అక్కడ నుంచి వెనక్కి తగ్గారు. హైదరాబాద్ నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాలకు గానూ టీఆర్ఎస్ పార్టీ 88 స్థానాల్లో విజయం సాధించింది. ఎంఐఎం పార్టీ 7 స్థానాల్లో విజయం సాధించింది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని గోషామహాల్ మినహా కార్వాన్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్ పురా, బహదూర్ పురా, మలక్ పేట్ నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. 

నాంపల్లి నియోజకవర్గంలో కూడా విజయం సాధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ గెలుపు ఖాయమనే ధీమా అసెంబ్లీ ఎన్నికల్లోనే వచ్చేసింది. ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు స్థానాలు కైవసం చేసుకోవడంతో ఆయన విజయం నల్లేరుపై నడకేనని తెలుస్తోంది. అయితే అజహరుద్దీన్ అయితే ముస్లిం మైనారిటీ ఓటర్లను, యువత ఓటర్లను ఆకట్టుకుంటారని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. 

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అవకాశం లేదని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు పలికే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ముందస్తు ఎన్నికల్లో మహాకూటమిగా వెళ్లిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మహాకూటమిగా వెళ్లే అవకాశం లేనట్లు తెలుస్తోంది. 

వామపక్ష పార్టీలు హ్యాండిచ్చే అవకాశం లేకపోలేదు. మరోవైపు టీజేఎస్ కూడా మహాకూటమిగా ఎన్నికల్లో వెళ్లే అవకాశం కనిపించడం లేదు. ఈపరిణామాలు ముహమ్మద్ అజహరుద్దీన్ కు కాస్త ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావచ్చని తెలుస్తోంది. 

ఈ వార్తలు కూడా చదవండి

ఓవైసీ కోట ఎన్నికల చరిత్ర ఇదీ...

click me!