తెలంగాణలో మోడీ ప్రచారం: అప్పుడు బాబుతో కలిసి, ఇప్పుడు ఒంటరిగా

By narsimha lodeFirst Published Mar 29, 2019, 4:14 PM IST
Highlights

2014 ఎన్నికలకు ముందు ఆనాడు ఎన్డీఏ ప్రధానమంత్రి అభ్యర్ధిగా ఉన్న నరేంద్ర మోడీ చంద్రబాబునాయుడుతో కలిసి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు


మహబూబ్‌నగర్: 2014 ఎన్నికలకు ముందు ఆనాడు ఎన్డీఏ ప్రధానమంత్రి అభ్యర్ధిగా ఉన్న నరేంద్ర మోడీ చంద్రబాబునాయుడుతో కలిసి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ దఫా ఎన్నికల్లో మోడీ ఒక్కడే ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. నాడు బీజేపీతో టీడీపీకి ఎన్నికల పొత్తుండగా, ఈ ఎన్నికల నాటికి ఆ బంధం తెగిపోయింది.  

2013 ఆగష్టు 11 వ తేదీన ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి మోడీ శ్రీకారం చుట్టారు. హైద్రాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ అంటూ ప్రశంసలు కురిపించారు. 

ఆ తర్వాత బీజేపీతో పొత్తుకు తాము కూడ సిద్దమనే సంకేతాలను చంద్రబాబునాయుడు ఇచ్చారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు కూడ కుదిరాయి. ఆనాడు బీజేపీ నేత పీయూష్ గోయల్ చంద్రబాబునాయుడుతో చర్చించారు. దీంతో రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తులు కుదిరాయి.

ఎన్నికల పొత్తు కారణంగా రెండు రాష్ట్రాల్లో ఈ పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ, చంద్రబాబునాయుడులు కలిసి  ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో తొలి సారి ఎన్నికల ప్రచార సభలో ఈ ఇద్దరు నేతలు పాల్గొన్నారు.

ఆనాడు మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా నాగం జనార్ధన్ రెడ్డి పోటీ చేశారు. నాగం జనార్ధన్ రెడ్డికి మద్దతుగా మోడీ, చంద్రబాబునాయుడులు ప్రచార సభలో పాల్గొన్నారు. 2014 ఏప్రిల్‌ 22వ తేదీన మహబూబ్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోడీ, చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.

తన పక్క సీటులోనే కూర్చోవాలని ఆ సభ వేదికపై మోడీ బలవంతంగా బాబును కూర్చోపెట్టుకొన్నాడు.  ఆ తర్వాత ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ ఇద్దరు నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ ఐదేళ్లలో రాజకీయ పరిణామాల్లో మార్పులు చోటు చేసుకొన్నాయి. ఎన్డీఏ నుండి టీడీపీ బయటకు వచ్చింది. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నరేంద్ర మోడీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా భూత్పూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు.

ఆనాడు బీజేపీలో ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి డీకే అరుణ ఇటీవలనే బీజేపీలో చేరారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి డీకే అరుణ ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.డీకే అరుణకు మద్దతుగా శుక్రవారం నాడు మోడీ భూత్పూరులో నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఈ సభలో కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. 

 

 


 

click me!