కొంత క్రెడిట్: హరీష్ సవాల్ పై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

By telugu teamFirst Published Apr 2, 2019, 7:42 AM IST
Highlights

కరీంనగర్ ఎంపీ సీటులో కన్నా మెదక్ స్థానంలో ఎక్కువ మెజారిటీ రావాలని హరీష్ రావు అన్నారు. దానికి ప్రతిగా మెదక్ లో కన్నా కరీంనగర్ లో ఎక్కువ మెజారిటీ రావాలని కేటీఆర్ అన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: పరిస్థితి చూస్తుంటే మెదక్ లోకసభ స్థానంలోనే తమ పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చేట్లు ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ఆ మెజార్టీలో తనకు కూడా కొంత క్రెడిట్ ఇవ్వాలని హరీష్ రావును కోరారు. ఇటీవలి ఎన్నికల ప్రచార సభలో హరీష్ రావు, కేటీఆర్ సవాల్, ప్రతిసవాల్ విసురుకున్నారు. 

కరీంనగర్ ఎంపీ సీటులో కన్నా మెదక్ స్థానంలో ఎక్కువ మెజారిటీ రావాలని హరీష్ రావు అన్నారు. దానికి ప్రతిగా మెదక్ లో కన్నా కరీంనగర్ లో ఎక్కువ మెజారిటీ రావాలని కేటీఆర్ అన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ ఆ వ్యాఖ్యలు చేశారు. 
 
తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల సమక్షంలో సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు.  సునీతా లక్ష్మారెడ్డి చేరికతో టీఆర్ఎస్ బలం మరింత పెరిగిందని, పరిస్థితులు చూస్తుంటే మెదక్‌లో పార్టీ ఎంపీ అభ్యర్థికి భారీ మెజార్టీ వచ్చేట్లు ఉందని కేటీఆర్ అన్నారు. కరీంనగర్ ఎంపీ స్థానానికి కూడా భారీ మెజారిటీ సాధించేందుకు ప్రయత్నిస్తామని, అయితే మెదక్‌లో భారీ మెజారిటీ వస్తే కొంత క్రెడిట్ నాకు కూడా ఇవ్వాలని ఆయన అన్నారు.
 
పట్టుమని పది సీట్లు కూడా దక్షిణాదిలో గెలవని పార్టీలు కూడా జాతీయ పార్టీలేనా అని కేటీఆర్ బిజెపిని ఉద్దేశించి అన్నారు. తెలంగాణలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఏంచేస్తారో చెప్పకుండా సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. 

click me!