దేవెగౌడ కాగా లేనిది కేసీఆర్ కాలేరా : అలకవీడిన ఎంపీ పొంగులేటి

By Nagaraju penumalaFirst Published Mar 30, 2019, 7:00 PM IST
Highlights

ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. నలుగురు ఎంపీలతో దేవెగౌడ ప్రధాని కాగా లేనిది కేసీఆర్ కాలేరా అంటూ వ్యాఖ్యానించారు. రాబోయే కాలంలో దేవెగౌడ మాదిరిగానే కేసీఆర్ కూడా ప్రధాని అవుతారన్నారు. 16 మంది ఎంపీలను గెలింపించుకుని కేసీఆర్ ను ప్రధానిని చేసుకుందామని స్పష్టం చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

ఖమ్మం: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తాను టీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. 

టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావును భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో జరిగిన సమావేశంలో పాల్గొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనకు ఎంపీ సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా టీఆర్ఎస్ పార్టీ వీడేది లేదని గతంలోనే సీఎం కేసీఆర్, కేటీఆర్ లకు స్పష్టం చేసినట్లు తెలిపారు. 

ఇకపోతే 2019 ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ సీటు ఆశించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అయితే కేసీఆర్ మాత్రం నామా నాగేశ్వరరావుకు టికెట్ ఇచ్చారు. దీంతో అలిగిన పొంగులేటి  పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎవరికి అందుబాటులో లేకుండా పోయారు. 

దీంతో ఆయన పార్టీ మారతారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే శనివారం టీఆర్ఎస్ సమావేశానికి హాజరయ్యారు. తాను వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందానని అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరానని చెప్పుకొచ్చారు. 

ఎంపీగా ఖమ్మం జిల్లా ప్రజల రుణం తీర్చుకున్నానని తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల తనకు ఎంపీ సీటు ఇవ్వలేకపోయారని అయినా కేసీఆర్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. 

తాను పార్టీ మారతానని కొందరు పగటికలలు కన్నారని, వేరే పార్టీ టికెట్ పై పోటీ చేస్తానని కూడా భావించారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ప్రతికూల ఫలితాలకు వేరే కారణాలు ఉన్నాయని తెలిపారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. నలుగురు ఎంపీలతో దేవెగౌడ ప్రధాని కాగా లేనిది కేసీఆర్ కాలేరా అంటూ వ్యాఖ్యానించారు. రాబోయే కాలంలో దేవెగౌడ మాదిరిగానే కేసీఆర్ కూడా ప్రధాని అవుతారన్నారు. 

16 మంది ఎంపీలను గెలింపించుకుని కేసీఆర్ ను ప్రధానిని చేసుకుందామని స్పష్టం చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యక్షమవ్వడంతో గులాబీశిబిరంలో నూతనోత్సాహం నెలకొంది.  

click me!