సర్వే: ఎన్నికల్లో కేసీఆర్‌కి నిరుద్యోగులే అసలు సమస్య

By narsimha lodeFirst Published Mar 28, 2019, 12:47 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని మెజారిటీ ఓటర్లు జాబ్ సమస్యను తీర్చాలని కోరుతున్నారు.ఉపాధి చూపాలని ఎక్కువ మంది ఓటర్లు ఆయా రాజకీయ పార్టీలు, అభ్యర్థులను కోరుతున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మెజారిటీ ఓటర్లు జాబ్ సమస్యను తీర్చాలని కోరుతున్నారు.ఉపాధి చూపాలని ఎక్కువ మంది ఓటర్లు ఆయా రాజకీయ పార్టీలు, అభ్యర్థులను కోరుతున్నారు. ఏడీఆర్ నిర్వహించిన సర్వేలో ఈ మేరకు మెజారిటీ ఓటర్లు ఇదే అంశాన్ని టాప్ ప్రయారిటీగా భావిస్తున్నట్టుగా తేలింది.

తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లు ఎక్కువగా తమ ఉద్యోగాల కోసమే దిగులు చెందుతున్నారని ఈ సర్వే తేల్చింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలో 79 శాతం మంది, మల్కాజిగిరిలో 74 శాతం మంది ఉద్యోగాల కోసం ఆందోళనతో ఉన్నారని ఈ సర్వే చెబుతోంది. ఆ తర్వాత స్థానంలో చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఓటర్లు ఉన్నారు. చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 73.3 శాతం ఓట్లరు 
ఆందోళనగా ఉన్నారని తేల్చింది.

పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఓటర్లు  ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఈ సర్వే  చెబుతోంది. గ్రామీణ ప్రాంతంలోని 63 శాతం మంది ఓటర్లు, పట్టణ ప్రాంతంలో71 శాతం ఓటర్లు ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్నారని సర్వే ప్రకటించింది.

ఉద్యోగాల తర్వాత పట్టణ ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం అనేది తీవ్రంగా వేధిస్తున్న సమస్యగా ఓటర్లు అభిప్రాయపడ్డారు. 50 శాతం ఓటర్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 45 శాతం ఓటర్లు తమ పంటలకు గిట్టుబాటు ధరల కోసం ప్రభుత్వాలు పట్టించుకోవాలని కోరారు. మరో 45 శాతం మంది మాత్రం విత్తనాలు, ఎరువులకు సబ్బిడీలను కొనసాగించాలని కోరారు.

ఇక నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని 56 శాతం ఓటర్లు తమ పంటలకు గిట్టుబాటు ధర కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓటర్ల డిమాండ్లు మరో రకంగా ఉన్నాయి. వ్యవసాయానికి విద్యుత్‌తో పాటు తాగు నీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు.

తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో టీఆర్ఎస్ ఉద్యమం చేసింది. ఐదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ సర్కార్ ఏ మేరకు ఉద్యోగాలను ఇచ్చిందని విపక్షాలు గతంలో పలు విమర్శలు కూడ చేసిన విషయం తెలిసిందే.

ఇక ఏపీలో ట్రాఫిక్ సమస్యను కూడ ఓటర్లు తమ ప్రాధాన్యతగా చూస్తున్నారు. ఇక దేశ వ్యాప్తంగా చూస్తే ఉద్యోగంతో పాటు హెల్త్‌కేర్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఓటర్లు కోరుతున్నారు.

click me!