ఒకే వేదికపై ఇద్దరు: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్, ఎమ్మెల్యేగా హరీష్

By narsimha lodeFirst Published Mar 8, 2019, 3:23 PM IST
Highlights

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావులు శుక్రవారం నాడు ఒకే వేదికను పంచుకొన్నారు. 


మెదక్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావులు శుక్రవారం నాడు ఒకే వేదికను పంచుకొన్నారు. గత నెల 19వ తేదీన మంత్రివర్గ విస్తరణ సమయంలో కేటీఆర్ పక్కనే హరీష్‌రావు పక్క పక్కనే కూర్చొన్నారు.  ఆ తర్వాత ఇదే కార్యక్రమంలో  వీరిద్దరూ ఒకే వేదికను పంచుకొన్నారు.

శుక్రవారం నాడు  మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 

కేటీఆర్‌తో  పాటు మెదక్ , సిద్దిపేట జిల్లాలకు  చెందిన నేతలు,  ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కేటీఆర్, హరీష్‌రావులు ఒకే వేదికపై పాల్గొన్నారు. కేటీఆర్ కంటే ముందుగానే హరీష్ రావు ఈ సభలో ప్రసంగించారు.

కేసీఆర్ వల్లే మెదక్, సిద్దిపేట జిల్లాలు ఏర్పడ్డాయని హరీష్ రావు చెప్పారు.  తెలంగాణ ఉద్యమంలో మెదక్  జిల్లా ముందుండే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ పోరాటాలు, ఎన్నికలు జరిగినా మెదక్ జిల్లా వాసులు ఉండేవారని ఆయన గుర్తు చేశారు. 

మెదక్‌ జిల్లా అంటేనే మెతుకుసీమ.. అందరికీ అన్నం పెట్టిన జిల్లా. మెదక్‌, సిద్దిపేట జిల్లాగా ఏర్పడింది అంటే సీఎం కేసీఆర్‌ వల్లే సాధ్యమైంది. గజ్వేల్‌, మెదక్‌కు రెండు నెలల్లో రైలు రాబోతుందన్నారు.. దేశానికే ఆదర్శంగా గజ్వేల్‌ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతోంది. కేసీఆర్‌ ఈ జిల్లా బిడ్డ కావడం వల్లే అభివృద్ధి సాధ్యమవుతోందని హరీష్ రావు  చెప్పారు. 

మెదక్ ఎంపీ అభ్యర్ధి ప్రభాకర్ రెడ్డిని  ఐదు లక్షల మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. మెదక్ జిల్లా అభివృద్ధి చేసిన కేసీఆర్‌ రుణం తీర్చుకోవాలంటే  ఐదు లక్షల మెజారిటీని తీసుకురావాల్సిందేనని హరీష్ రావు చెప్పారు. మరో వైపు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకొని కేటీఆర్, హరీష్‌రావులు ఒకేసారి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 

click me!