ప్రధానిని మనమే నిర్ణయించాలి: కేటీఆర్

By narsimha lodeFirst Published Mar 8, 2019, 2:11 PM IST
Highlights

ఎర్రకోటపై జాతీయ జెండా  ఎగురవేసే వారిని తెలంగాణ ప్రజలు నిర్ణయించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్  అన్నారు


మెదక్: ఎర్రకోటపై జాతీయ జెండా  ఎగురవేసే వారిని తెలంగాణ ప్రజలు నిర్ణయించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్  అన్నారు. శుక్రవారం నాడు మెదక్ పార్లమెంట్  నియోజకవర్గానికి చెందని టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో  కేటీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 

ఢిల్లీని శాసించే అధికారం ఉంటే తెలంగాణ అభివృద్ధి సులభమని ఆయన చెప్పారు. రైతు బంధు పథకాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని అమలు చేస్తున్నాయని కేటీఆర్ గుర్తు చేశారు.

దేశానికి మోడీ  ఏం  చేయలేదన్నారు. బీజేపీ పాలనలో  దేశం ఏ మాత్రం అభివృద్ధి సాధించలేదని చెప్పారు.  పెద్ద నగదు నోట్లను రద్దు చేసి మోడీ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని కేటీఆర్ ఆరోపించారు.

తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొట్టిందన్నారు. నిత్యం ఏపీపై నోరు పారేసుకొనే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడ అన్నదాత సుఖీభవ పేరుతో  రైతు బంధు పథకాన్ని అమలు  చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గతంలో  వ్యవసాయం దండగ అన్న చంద్రబాబునాయుడు  రైతుల కోసం కూడ పథకాన్ని తెలంగాణను చూసీ కాపీ కొట్టారని చెప్పారు.

రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు టీఆర్ఎస్, ఒక్క ఎంపీ స్థానంలో ఎంఐఎం గెలవాల్సిన అవసరం ఉందన్నారు.  రాష్ట్రంలోని అన్ని ఎంపీలను గెలిపిస్తే కేంద్రాన్ని శాసించి తెలంగాణకు నిధులను రాబడుతామని చెప్పారు.

తెలంగాణలో బీజేపీకి అడ్రస్ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణలో టీఆర్ఎస్‌కు పోటీ ఉంటుందన్నారు.  అయితే కాంగ్రెస్ నేతల్లో నిస్సత్తువ నెలకొందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు  కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడ ముందుకు రావడం లేదని  కేటీఆర్ ఎద్దేవా చేశారు.  

click me!