లోకసభ ఎన్నికలు: హరీష్ రావును పూర్తిగా పక్కన పెట్టేసిన కేసీఆర్

By telugu teamFirst Published Mar 23, 2019, 11:09 AM IST
Highlights

గతంలో ట్రబుల్ షూటర్ గా పేరు గాంచి, ప్రతి విషయంలోనూ చురుగ్గా పాల్గొనే హరీష్ రావును ఆయన సొంత నియోజకవర్గం సిద్ధిపేటకు మాత్రమే పరిమితం చేసినట్లు కనిపిస్తోంది. 

హైదరాబాద్‌: తెలంగాణ లోకసభ ఎన్నికల్లో మాజీ మంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మేనల్లుడు హరీష్ రావు పాత్ర లేకుండా పోయింది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ఆయనను కేసీఆర్ పక్కన పెట్టేశారు. ఆయనను కేవలం సిద్ధిపేట శాసనసభ స్థానానికి మాత్రమే పరిమితం చేశారు. 

మెదక్ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి మాత్రం హరీష్ రావు హాజరయ్యారు. మెదక్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని చెప్పారు. 

గతంలో ట్రబుల్ షూటర్ గా పేరు గాంచి, ప్రతి విషయంలోనూ చురుగ్గా పాల్గొనే హరీష్ రావును ఆయన సొంత నియోజకవర్గం సిద్ధిపేటకు మాత్రమే పరిమితం చేసినట్లు కనిపిస్తోంది. శాసనసభ్యులు కొందరు ఇతరుల నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని, అలాంటి చర్యలకు శాసనసభ్యులు స్వస్తి చెప్పాలని ఆ మధ్య టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హెచ్చరించారు కూడా.

కేటీఆర్ హెచ్చరిక హరీష్ రావుకు కూడా వర్తిస్తుందనే ప్రచారం సాగుతోంది.  గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ హరీష్ రావు పార్టీ తరఫున కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన కేవలం సిద్ధిపేటకు మాత్రమే పరిమితం కావాల్సిన పరిస్థితిని కేసిఆర్ కల్పించారని అంటున్నారు. 

టీఆర్ఎస్ నేతలు కూడా హరీష్ రావును కలవడం మానేశారు. పార్టీ టికెట్లు పొందిన నేతలు, పదవులు దక్కించుకున్న నేతలు గతంలో హరీష్ రావును తప్పకుండా కలిసి ధన్యవాదాలు చెప్పేవారు. ఇప్పుడు కేవలం కేటీఆర్ ను, పార్లమెంటు సభ్యురాలు కవితను మాత్రమే కలుస్తున్నారు. ఇటీవల మంత్రి పదవులు దక్కినవారు వారిద్దరినే కలిసి ధన్యవాదాలు తెలిపారు. వారు హరీష్ రావును కలుసుకోలేదు. 

లోకసభ టికెట్లు దక్కించుకున్నవారు కూడా కవితను, కేటీఆర్ ను మాత్రమే కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం హరీష్ రావు కీలకమైన పాత్ర పోషించారు ప్రచారంలో కేసీఆర్ తర్వాత హెలికాప్టర్ ను వాడుకునే అవకాశం హరీష్ రావుకు మాత్రమే దక్కింది. 

కీలకమైన కాంగ్రెసు నేతలు జానారెడ్డి, రేవంత్ రెడ్డి, డికె అరుణ, జె. గీతా రెడ్డి, దామోదర రాజనర్సింహలను ఓడించే బాధ్యతను కేసీఆర్ హరీష్ రావుకు అప్పగించారు. సంగారెడ్డి మినహా అన్ని చోట్ల హరీష్ రావు తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి ఫలితాలు సాధించారు. 

శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించిన తర్వాత కేసీఆర్ హరీష్ రావును పూర్తిగా విస్మరించడం ప్రారంభించారనే మాట వినిపిస్తోంది. ప్రభుత్వంలో గానీ, పార్టీలో గానీ ఆయనకు ఏ విధమైన పాత్ర లేకుండా పోయింది. ఓ సాధారణమైన ఎమ్మెల్యేగా మిగిలిపోయే పరిస్థితిని కేసీఆర్ కల్పించారు. 

ఎప్పుడో గానీ హరీష్ రావు తెలంగాణ భవన్ కు వెళ్లడం లేదు. అలాగే, ప్రగతిభవన్ ను సందర్శించిన సందర్భాలు కూడా చాలా తక్కువే. శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన కేసీఆర్ ను అతి కొద్ది సందర్భాల్లోనే కలిసినట్లు చెబుతున్నారు. 

click me!