కాల్స్‌పై ఆరు పైసల చార్జీ...జనవరి నుంచి రద్దు...

By Sandra Ashok Kumar  |  First Published Dec 18, 2019, 12:13 PM IST

ఐయూసీ చార్జీల ఎత్తివేత అంశాన్ని ట్రాయ్ వాయిదా వేసింది. దీని ప్రకారం వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకు ఐయూసీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇతర నెట్‌వర్క్ కాల్స్‌పై ఆరు పైసల చార్జీ కొనసాగనున్నది.


న్యూఢిల్లీ: ఇతర టెలికం ప్రొవైడర్లకు కాల్ చేస్తే చెల్లించాల్సిన ఇంటర్‌ కనెక్ట్ యూసేజ్ చార్జీల (ఐయూసీ)ను రద్దు చేసే గడువును టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) పొడిగించింది. వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అంటే 2021 జనవరి ఒకటో తేదీ నుంచి ఐయూసీ చార్జీలు రద్దు చేస్తారు. నిజానికి ఈ నెల 31తో ఐయూసీ చార్జీలు రద్దవుతాయని ట్రాయ్ గతంలో ప్రకటించింది. 

also read ఇక ఫ్రీ కాల్స్, డేటాకు స్వస్తి... జనవరి 17 దాకా గడువు... !!

Latest Videos

ఈ నిర్ణయాన్ని ట్రాయ్ తాజాగా ఏడాది కాలం వాయిదా వేసింది. ప్రస్తుతం రెండు వేర్వేరు నెట్‌వర్క్‌ల కస్టమర్ల మధ్య వాయిస్ కాల్స్‌కు నిమిషానికి ఆరు పైసలు వసూలు చేస్తున్నారు. ట్రాయ్ తాజా నిర్ణయంతో ఈ వసూళ్లు మరో ఏడాదిపాటు కొనసాగనున్నాయి. ‘మెజారిటీ టెలికం సంస్థల అభిప్రాయాలు, ప్రస్తుతం పరిశ్రమలో నెలకొన్న ధరల యుద్ధం, ఇతరత్రా పరిణామాలపై వచ్చిన విశ్లేషణలను అనుసరించి ఐయూసీ చార్జీలను 2020 డిసెంబర్ 31 వరకు పొడిగించాలని నిర్ణయించాం. 2021 జనవరి నుంచి ఈ చార్జీలు రద్దవుతాయి’ అని ట్రాయ్ వెల్లడించింది. 

 

ఇంతకుముందు ఐయూసీ చార్జీలు నిమిషానికి 14 పైసలుగా ఉండగా, సెప్టెంబర్ 2017లో ఆరు పైసలకు తగ్గిస్తూ ట్రాయ్ నిర్ణయం తీసుకున్నది. ట్రాయ్ నిర్ణయం భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలకు లాభించనున్నది. ప్రస్తుతం రిలయన్స్ జియోతో పోలిస్తే వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌లకే ఎక్కువ మంది కస్టమర్లు ఉన్నారు. దీంతో ఈ కస్టమర్లకు జియో కస్టమర్లు ఫోన్ చేసిన ప్రతీసారి నిమిషానికి 6 పైసల చొప్పున వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌లకు జియో చెల్లించాల్సి వస్తున్నది. 

also read షియోమీతో ‘టగ్ ఆఫ్ వార్’: ఆర్థిక సేవల్లోకి రియల్‌మీ

ఇంతకుముందు ఈ భారాన్ని జియోనే మోసినప్పటికీ.. ఇప్పుడు కస్టమర్లపై వేసింది. నిర్ణీత ప్లాన్లపై అదనంగా టాప్‌అప్‌లను వేసుకోవాల్సి వస్తున్న విషయం తెలిసిందే. దాంతో సంస్థపై కొంత ప్రతికూల ప్రభావం పడుతుండగా, ఈ చార్జీలను మరో ఏడాదిపాటు ట్రాయ్ పొడిగించడం జియోకు మింగుడుపడని అంశమే. ఐయూసీ చార్జీలను రద్దు చేయాలని ఎప్పట్నుంచో ట్రాయ్‌ని జియో కోరుతున్నది. ఐయూసీ ద్వారా ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలకు అదనపు ఆదాయం సమకూరుతుండగా, జియో ఆదాయానికి మాత్రం గండి పడుతున్నది.
 

click me!