ఇప్పటి వరకు టెలికం రంగంలో ఉన్న విధానాలు మారిపోనున్నాయి. ఫ్రీ కాల్స్, డేటా విధానానికి ట్రాయ్ స్వస్తి పలుకనున్నది. కనీస చార్జీల విధింపుపై ట్రాయ్ చర్చాపత్రం అనుసరించాల్సిన విధానంపై అభిప్రాయ సేకరణకు దిగింది. దీనిపై టెల్కో సంస్థలు, కస్టమర్లు, ఇతరులు అభిప్రాయాలు తెలిపేందుకు జనవరి 17 దాకా గడువు అని పేర్కొంది.
న్యూఢిల్లీ: చౌక మొబైల్ కాల్స్, డేటా విధానానికి స్వస్తి పలకాలన్న ప్రతిపాదనలను టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) ముందుకు తీసుకువచ్చింది. కనీస చార్జీలు వడ్డించే ప్రతిపాదనలపై ట్రాయ్ దృష్టి సారించింది. దీనిపై తాజాగా చర్చాపత్రాన్ని విడుదల చేసింది.
ఇటు టెల్కో సంస్థలు, అటు కస్టమర్ల ప్రయోజనాల పరిరక్షణకు టారిఫ్‌ల విషయంలో నియంత్రణ సంస్థ జోక్యం చేసుకోవాల్సిన అవసరంపైనా, మొబైల్ సర్వీసెస్ కనీస చార్జీలను నిర్ణయించడంపైనా సంబంధిత వర్గాల అభిప్రాయాలు కోరింది. ఒకవేళ కనీస చార్జీలు నిర్ణయించాల్సి వస్తే కొత్త ఆపరేటర్లకు అకస్మాత్తుగా లాభాలు వచ్చి పడకుండా అనుసరించాల్సిన విధానాలపైనా అభిప్రాయాలను ఆహ్వానించింది.
also read షియోమీతో ‘టగ్ ఆఫ్ వార్’: ఆర్థిక సేవల్లోకి రియల్‌మీ
ఈ చర్చాపత్రంపై వచ్చే ఏడాది జనవరి 17వ తేదీ వరకు గడువు ఉంటుంది. వీటిపై కౌంటర్–కామెంట్స్ సమర్పించడానికి జనవరి 31 చివరి తేది. ‘టెలికం రంగంలో శరవేగంగా మారే టెక్నాలజీలను అందుకోవాలంటే భారీ పెట్టుబడులు కావాలి. ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలకు కీలకంగా మారిన టెలికం రంగం ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం.
టెలికం రంగ సమస్యల పరిష్కారానికి, పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత వర్గాలంతా చర్చించాల్సిన అవసరం ఉంది‘ అని ట్రాయ్ ఒక ప్రకటనలో పేర్కొంది.టెలికం రంగంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో తాజాగా ట్రాయ్ విడుదల చేసిన చర్చాపత్రం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం టారిఫ్‌ల విషయంలో టెల్కోలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. టారిఫ్ ప్లాన్లను ప్రకటించిన వారం రోజుల్లోగా ట్రాయ్‌కు తెలిపితే సరిపోతుంది.అందువల్లే యూజర్లను ఆకర్షించేందుకు టెల్కోలు పోటాపోటీగా ఉచిత, అత్యంత చౌక ప్లాన్స్ కూడా అందిస్తూ వచ్చాయి. ఒకవేళ కనీస చార్జీల విధానం గానీ అమల్లోకి వస్తే.. ఉచిత సర్వీసులకు ఇక కాలం చెల్లినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
also read ప్రీపెయిడ్ ప్లాన్ల వాలిడిటీని తగ్గించిన బిఎస్‌ఎన్‌ఎల్...ఎంతంటే..?
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ.. టెలికం రంగాన్ని గట్టెక్కించేందుకు పరిశీలించతగిన చర్యలంటూ అక్టోబర్‌లో చేసిన సిఫార్సుల్లో ఈ కనీస చార్జీల ప్రతిపాదన కూడా ఉంది. అటు పాత టెల్కోలు కూడా దీన్ని గట్టిగా కోరుతున్నాయి. రిలయన్స్ జియో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత రెండేళ్ల క్రితం టెల్కోలు ఇలాంటి ప్రతిపాదనే చేసినా ఇది సాధ్యపడే విషయం కాదని ట్రాయ్ తోసిపుచ్చింది. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో దీన్ని పరిశీలించాలని భావిస్తోంది.
లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల విషయంలో ఇటీవల సుప్రీంకోర్టులో ప్రతికూల ఆదేశాలు రావడంతో టెల్కోలు దాదాపు రూ. 1.4 లక్షల కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియా రికార్డు స్థాయిలో రూ. 50,922 కోట్ల మేర, ఎయిర్‌టెల్ రూ. 23,045 కోట్లు నష్టాలు ప్రకటించింది.