టెలికం శాఖకు టెలికం ప్రొవైడర్లు చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిల్లో లైసెన్స్ ఫీజు బాకీల్లో 74 శాతం వడ్డీ, జరిమానాలు, జరిమానాలపై వడ్డీ ఉన్నాయి.
న్యూఢిల్లీ: టెలికం శాఖకు టెలికం ప్రొవైడర్లు చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిల్లో లైసెన్స్ ఫీజు బాకీల్లో 74 శాతం వడ్డీ, జరిమానాలు, జరిమానాలపై వడ్డీ ఉన్నాయి. జనవరి నాటికి ఏజీఆర్ బకాయిల విలువ రూ.92,642 కోట్లు లైసెన్స్ ఫీజు, ఇంటరెస్ట్, పెనాల్టీలు. వీటిలో స్పెక్ట్రం యూసేజీ చార్జీల విలువ మొత్తం రూ.70,869 కోట్లు.
Also read:కరోనా ఎఫెక్ట్: టీవీ,ఫ్రిజ్, ఏయిర్ కండిషనర్ల ధరలు ఇంకా పైపైకి
లైసెన్స్ ఫీజు చెల్లింపుల్లో సంస్థల వాటాలివి
మిగతాదంతా దీనిపై వడ్డీ, జరిమానాలు, ఆ జరిమానాలపై మళ్లీ వడ్డీనేనని సంబంధిత టెలికం శాఖ వర్గాలు తెలిపాయి. కాగా, లైసెన్స్ ఫీజు బకాయిల్లో భారతీ ఎయిర్‌టెల్ వాటా రూ.5,528.52 కోట్లుగా ఉంటే, వొడాఫోన్ ఐడియాది రూ.6,870.69 కోట్లుగా ఉన్నది. టాటా గ్రూప్ రూ.2,321.31 కోట్లు, టెలినార్ (ఎయిర్‌టెల్‌లో విలీనమైంది) రూ.529.02 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్ రూ.614 కోట్లు, ఎంటీఎన్‌ఎల్ రూ.876.39 కోట్ల బకాయిలు ఉన్నాయి.
జూలై నాటికే ఏజీఆర్ బకాయిలు రూ.1.47 లక్షల కోట్లు
గతేడాది జూలై నాటికి టెలికం సంస్థల మొత్తం ఏజీఆర్ బకాయిలు రూ.1.47 లక్షల కోట్లు. ఇందులో రూ.92,641 కోట్లు లైసెన్స్ ఫీజు కింద చెల్లింపులు జరుపాల్సిన సొమ్ము. మిగతా రూ.55,054 కోట్లు స్పెక్ట్రం వినియోగ చార్జీలు. ఇదిలావుంటే నిరుడు జూలై నాటికే ఈ లెక్కలని, ఇప్పటిదాకా లెక్కిస్తే బకాయిలు పెరుగుతాయని, ప్రస్తుతం అదే పనిలో ఉన్నామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
మరోసారి నోటీసులివ్వనున్న టెలికశాఖ
టెలికం సంస్థలకు టెలికం శాఖ మరోసారి నోటీసులను జారీ చేయనున్నది. ఏజీఆర్ బకాయిలు పూర్తిగా చెల్లించనందుకు ఈ వారం వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్, టాటా టెలీసర్వీసెస్‌లకు టెలికం శాఖ నోటీసులు ఇవ్వనుందని సంబంధిత వర్గాల సమాచారం. సోమవారం భారతీ ఎయిర్‌టెల్ రూ.10,000 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.2,500 కోట్లు, టాటా టెలీ సర్వీసెస్ రూ.2,197 కోట్లు చెల్లించిన విషయం తెలిసిందే.
వివిధ సంస్థల బకాయిలివి
వొడాఫోన్ ఐడియా బకాయిలు రూ.53,038 కోట్లుగా ఉంటే, భారతీ ఎయిర్‌టెల్ బకాయిలు రూ.35,586 కోట్లుగా ఉన్న సంగతి విదితమే. దీంతో మిగతా బాకీల వసూలులో భాగంగా టెలికం శాఖ ఒకటి, రెండ్రోజుల్లో మళ్లీ నోటీసులు ఇవ్వనుంది. టాటా టెలీసర్వీసెస్ తమ పూర్తి, తుది చెల్లింపుగానే రూ.2,197 కోట్లు ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వ గణన ప్రకారం పూర్తి బకాయిలు చెల్లించాలని కోరుతూ ఈ సంస్థకు టెలికం శాఖ ప్రత్యేకంగా నోటీసులు జారీ చేయనుంది.
టాటా టెలీ సర్వీసెస్‌కూ తప్పని ఏజీఆర్ బెడద
బాకీ మొత్తం చెల్లించకుండా టాటా టెలీసర్వీసెస్ తప్పించుకోలేదని టెలికం శాఖకు చెందిన ఓ అధికారి అన్నారు. సంస్థ ఇటీవల చెల్లించిన రూ.2,197 కోట్లు కేవలం అసలేనని, దీనిపై వడ్డీ, జరిమానాలతోపాటు జరిమానాపై వడ్డీని కూడా చెల్లించాల్సి ఉందని చెప్పారు. మొత్తం బకాయి రూ.14,000 కోట్లపైనే ఉంటుందని అంటున్నారు.
న్యాయ సలహాలకై టెలికం శాఖ చర్యలు
ఏజీఆర్ బకాయిల అంశంలో న్యాయపరమైన సలహాలనూ టెలికం శాఖ తీసుకుంటున్నది. ‘ఇప్పటికిప్పుడే టెలికం సంస్థల బ్యాంక్ గ్యారెంటీలను మేము స్వాధీనం చేసుకోగలం. అయినప్పటికీ వచ్చే నెల 17కు ముందే ఈ చర్యకు దిగొచ్చా? ఆ తర్వాత చేయవచ్చా? అన్నదానిపై న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని తీసుకుంటున్నాం’ అని టెలికం శాఖ అధికారి అన్నారు.
గతేడాది అక్టోబర్ నెలలో ఏజీఆర్ బకాయిలపై సుప్రీంకోర్టు ఇలా
టెలికం సంస్థల వార్షిక సవరణ స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కింపులో నాన్-కోర్ బిజినెస్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్నీ కలుపాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను సుప్రీం కోర్టు గతేడాది అక్టోబర్‌లో సమర్థించడంతో ఏజీఆర్ బకాయిలు ఈ స్థాయిలో పెరిగాయి. మొత్తం 15 సంస్థలు టెలికం శాఖకు ఇవ్వాల్సిన ఏజీఆర్ బకాయిలు రూ.1.47 లక్షల కోట్లుగా ఉన్నాయి.
టెలికం శాఖ డెస్క్ అధికారిపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఇందులో స్పెక్ట్రం వినియోగ చార్జీల బకాయిలు రూ.55,054 కోైట్లెతే, రూ. 92,642 కోట్లు లైసెన్స్ ఫీజు బాకీలు. గత నెల 23కల్లా ఏజీఆర్ బకాయిలన్నింటినీ తీర్చాలని టెలికం సంస్థలకు సుప్రీం గడువిచ్చింది. అయితే ఈ దిశగా ఎలాంటి అడుగులు పడకపోవడంపై ఆరా తీసిన సుప్రీం.. తామిచ్చిన తీర్పుపై టెలికం శాఖ డెస్క్ అధికారి స్టే విధిస్తారా అంటూ ఈ నెల 14న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
సోమవారానికి రూ.15 వేల కోట్ల చెల్లింపులు
టెలికం శాఖ అదేరోజు టెలికం సంస్థలకు నోటీసులు జారీ చేయగా, సోమవారం దాదాపు రూ.15 వేల కోట్ల చెల్లింపులు జరిగాయి. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు.. ఆలోగా బకాయిలు చెల్లించకపోతే సదరు సంస్థల ఎండీలు ధర్మాసనం ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. దీంతో బాకీల వసూలుకు సంబంధించి కఠిన చర్యల కోసం వచ్చే నెల 17 వరకు ఆగాలా? లేదా? అన్నదానిపై టెలికం శాఖ న్యాయ సలహాలను తీసుకుంటున్నది.
పన్నులు తగ్గించాలి: సునీల్ మిట్టల్
ఏజీఆర్ సంక్షోభం నేపథ్యంలో టెలికం రంగంపై పన్నుల భారాన్ని తగ్గించాలని భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ కేంద్రాన్ని కోరారు. గురువారం న్యూఢిల్లీలో ఆయన టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌ను కలిశారు. ఈ సందర్భంగా టెలికం రంగంపై విధిస్తున్న పన్నులు, వేస్తున్న సుంకాలకు కోత పెట్టాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీం కోర్టు ఆదేశానుసారం ఏజీఆర్ బకాయిలను మార్చి 17కల్లా ఎయిర్‌టెల్ చెల్లిస్తుందన్న ఆయన వీలైనంత త్వరగానే మొత్తం చెల్లించేస్తామని స్పష్టం చేశారు.
కేంద్రం ప్రసన్నత కోసం ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా పాట్లు
‘దేశీయ టెలికం పరిశ్రమ మునుపెన్నడూ ఎదుర్కోని సంక్షోభం.. ఏజీఆర్ బకాయిలు. దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తున్నాం’ అని అన్నారు. బుధవారం మిట్టల్‌తోపాటు వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార్ మంగళం బిర్లా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఏజీఆర్ కష్టాలను మంత్రి తో ఈ ఇరువురు చర్చించినట్లు తెలుస్తున్నది.
రవిశంకర్ ప్రసాద్ తో భేటీలో సునీల్ మిట్టల్, నిర్మలా సీతారామన్ తో సమావేశంలో కుమార మంగళం బిర్లా తమ బకాయిల చెల్లింపుల కోసం మరింత గడువును కోరినట్లు సమాచారం. కాగా, గల మూడున్నరేళ్లుగా టెలికం పరిశ్రమ ఒత్తిడిలో ఉందని, ఆదుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు మిట్టల్ సమావేశం అనంతరం చెప్పారు. అంతకుముందే టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాశ్‌తోనూ మిట్టల్ భేటీ అయ్యారు.
మరో వెయ్యి కోట్లు చెల్లించిన వొడాఫోన్ ఐడియా
వొడాఫోన్ ఐడియా గురువారం తమ ఏజీఆర్ బకాయిల్లో మరో రూ.1,000 కోట్లను టెలికం శాఖకు చెల్లించిందని ఓ సీనియర్ అధికారి తెలియజేశారు. ఇప్పటికే ఈ సంస్థ రూ.2,500 కోట్లను చెల్లించిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం ఈ వారం రూ.3,500 కోట్లు ఇచ్చినైట్లెంది. టెలికం శాఖకు వొడాఫోన్ ఐడియా రూ.53,000 కోట్లకుపైగా బకాయిపడింది.
వొడాఫోన్ స్పెక్ట్రం బకాయిలు రూ.24,729 కోట్లే
ఇందులో రూ.24,729 కోట్లు స్పెక్ట్రం బకాయిలు, మరో రూ.28,309 కోట్లు లైసెన్స్ ఫీజు ఉన్నాయి. బకాయిల చెల్లింపుపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన వొడాఫోన్ ఐడియాకు నిరాశే మిగిలిన సంగతి విదితమే. నిధుల సమీకరణలో అష్టకష్టాలు పడుతున్న సంస్థ.. తమకు ఊరట లభించకపోతే మనుగడే కష్టమన్న సంకేతాలను ఇస్తుండటం గమనార్హం.
బకాయిలపై పూర్తిస్థాయి మదింపులో టెలికం శాఖ నిమగ్నం
మరోవైపు బకాయి లెక్కలన్నీ నిరుడు జూలై వరకే కావడంతో ఇప్పటిదాకా బాకీలెంత? అన్నదానిపై టెలికం శాఖ మదింపు చేస్తున్నది. మార్చి 17లోగా సమగ్రంగా లెక్కించనున్నట్లు తెలుస్తున్నది. వచ్చే 7-8 రోజుల్లో మరింతగా చెల్లింపులు జరుగవచ్చన్న అంచనాలున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశం, టెలికం రంగ పరిస్థితులు, వినియోగదారుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ అంశంలో నిర్ణయం తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.