షియోమీ, వన్‌ప్లస్ లాగే ‘స్మార్ట్ టీవీల్లోకి’ ఇన్ఫినిక్స్

By Sandra Ashok Kumar  |  First Published Dec 16, 2019, 12:36 PM IST

షియామీ, వన్‌ప్లస్, మోటోరోలా వంటి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు.. స్మార్ట్ టీవీల ఉత్పత్తిలోకి రాగా, ఈ జాబితాలో తాజాగా హాంకాంగ్ ఆధారిత సంస్థ ఇన్ఫినిక్స్ చేరింది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో భారతీయ మార్కెట్‌లోకి స్మార్ట్ టెలివిజన్లను తేవాలన్న లక్ష్యంతో ఇన్ఫినిక్స్ ముందుకెళ్తున్నది.


న్యూఢిల్లీ: టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ మానవ జీవితం మరింత సౌకర్యవంతంగా మారుతోంది. ఫలితంగా మార్కెట్ యావత్తూ స్మార్ట్‌గా రూపాంతరం చెందుతున్నది. ఈనాడు అంతటా స్మార్ట్ ఉత్పత్తులే దర్శనం ఇస్తున్నాయి. ముఖ్యంగా టెలివిజన్ రంగం స్మాట్ పుంతలు తొక్కుతోంది. అందుకే స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ఇప్పుడు స్మార్ట్ టీవీలపైనా దృష్టి పెడుతున్నాయి.

ఇప్పటికే షియామీ, వన్‌ప్లస్, మోటోరోలా వంటి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు.. స్మార్ట్ టీవీల ఉత్పత్తిలోకి రాగా, ఈ జాబితాలో తాజాగా హాంకాంగ్ ఆధారిత సంస్థ ఇన్ఫినిక్స్ చేరింది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో భారతీయ మార్కెట్‌లోకి స్మార్ట్ టెలివిజన్లను తేవాలన్న లక్ష్యంతో ఇన్ఫినిక్స్ ముందుకెళ్తున్నది.

Latest Videos

also read తొలి ఏడాదే ఇండియన్ బెస్ట్ బ్రాండ్ ‘రియల్ మీ’

‘స్మార్ట్ టీవీలు, స్మార్ట్ యాక్సెసరీస్ వంటి కొత్త వ్యాపారాల్లోకి ప్రవేశించాలని చూస్తున్నాం. ఇప్పుడే వీటి గురించి మాట్లాడలేం. 2020 ప్రథమార్ధంలో స్మార్ట్ టీవీలను మార్కెట్‌కు పరిచయం చేసే వీలున్నది’ అని ఇన్ఫినిక్స్ ఇండియా సీఈవో అనిశ్ కపూర్ పీటీఐకి తెలిపారు. 

హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ హక్కులను పొందడం ముఖ్యమని ఇన్ఫినిక్స్ ఇండియా సీఈవో అనిశ్ కపూర్ తెలిపారు. తొలుత భారత్‌లోనే తమ స్మార్ట్ టీవీలను ఆవిష్కరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే చాలా స్మార్ట్ టీవీల కంపెనీలు భారతీయ మార్కెట్‌లో విక్రయాలు జరుపుతున్నా.. విపణిలో ఇంకా పుష్కలమైన అవకాశాలున్నాయన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు.

స్మార్ట్ టెలివిజన్ మార్కెట్ అత్యంత ఆకర్షణీయంగా, మరెంతో ఖరీదైనదిగా ఉన్నది. ఇందుకు కారణం అత్యాధునిక ఫీచర్లను ఈ టీవీలు కలిగి ఉండటమే. బ్లూటూత్, వైఫైలతోపాటు వీడియోకాల్, రికార్డింగ్ తదితర వెసులుబాట్లు ఈ స్మార్ట్ టీవీల్లో అందుబాటులో ఉంటున్నాయి. ఇంకా అనేక ఫీచర్లను కొత్త సంస్థలు అందిస్తుండగా, ఇన్ఫినిక్స్ కూడా ఆ కోణంలో అన్వేషిస్తున్నది. శామ్‌సంగ్, ఎల్‌జీ, సోనీ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే స్మార్ట్ టీవీల మార్కెట్‌ను ఏలుతున్నాయి. నాలుగింట మూడు వంతుల వాటా ఈ మూడు సంస్థలదే. ఏటా దాదాపు 12.5 మిలియన్ల టీవీలు అమ్మడు అవుతున్నట్లు అంచనా. 

also read ఆ ఫోన్లను అప్ గ్రేడ్ చేసుకోండి.. లేకపోతే 2020లో వాట్సాప్​ సేవలు బంద్​

షియోమీ, మైక్రోమ్యాక్స్, మోటోరోలా తదితర సంస్థలూ స్మార్ట్ టీవీలను తయారుచేసి మార్కెట్‌లో నిలదొక్కుకోవాలని చూస్తున్నాయి. మామూలు టెలివిజన్లతో పోల్చితే స్మార్ట్ టెలివిజన్ల ధరలు కాస్త ఎక్కువగానే ఉంటున్నాయి. ఈ క్రమంలో ధరలు తగ్గితే మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తాయన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. 

కొత్తగా స్మార్ట్ టీవీల రంగంలోకి వస్తున్న సంస్థలు తక్కువ ధరలతో ఎక్కువ ఫీచర్లతో కూడిన స్మార్ట్ టీవీలను పరిచయం చేస్తే పెద్ద ఎత్తున అమ్మకాలు సాధించవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో షియోమీ ఈ తరహా ఎత్తుగడతో మార్కెట్ లీడర్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఇటీవల ఫ్లిప్‌కార్ట్.. దేశీయ మార్కెట్‌లో నోకియా స్మార్ట్ టీవీని ఆవిష్కరించిన సంగతి విదితమే.

click me!