ఉచిత కాల్స్‌ ‘ఎరా’కు తెర!.. చౌక డేటాకు చెల్లుచీటి!!

By Sandra Ashok KumarFirst Published Oct 30, 2019, 11:02 AM IST
Highlights

టెలికం రంగ సంస్థలు ఎదుర్కొంటున్న కష్టాలపై అధ్యయనానికి క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సారథ్యంలో కమిటీ ఏర్పాటైంది. ఏజీఆర్ చెల్లింపులు జరుపాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా చిక్కుల్లో పడ్డాయి. ఈ నేపథ్యంలో తమకు టైం కావాలని కేంద్రాన్ని అభ్యర్థించాయి. దీంతో సమస్యలపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ.. ఉచిత కాల్స్, చౌక డేటా విధానాలకు చెల్లుచీటి పలుకాల్సిందిగా టెలికం ప్రొవైడర్లను కోరే అవకాశాలు ఉన్నాయి. వినియోగదారులకు ఆఫర్లు దూరం కావడంతోపాటు త్వరలో టెలికం సంస్థలకు ఉద్దీపన ప్యాకేజీ అందుబాటులోకి రానున్నది.  

న్యూఢిల్లీ: టెలికం రంగంలో ఉచిత మొబైల్‌ కాల్స్‌కు తెర పడనున్నదా? చౌక ఇంటర్నెట్‌తో కూడిన ప్యాకేజీలు దూరం కానున్నాయా? కస్టమర్లకు టెలికం సంస్థలు ఎడాపెడా అందిస్తున్న పలు ఆకర్షణీయ ఆఫర్లకు కాలం తీరిందా? అంటే అవుననే సమాధానం వస్తున్నది.

ప్రైవేట్ టెలికం కంపెనీల వార్షిక ఏజీఆర్‌పై సుప్రీం కోర్టు ఇటీవలి ఆదేశాలు.. పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేసిన విషయం తెలిసిందే. టెలీ కమ్యూనికేషనేతర వ్యాపారం నుంచి వచ్చే ఆదాయాన్నీ వార్షిక సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్‌) లెక్కింపులో కలుపాలన్న కేంద్రం వాదనతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించిన సంగతి విదితమే.

దీంతో టెలికం శాఖకు టెల్కోలు మూడు నెలల్లోగా రూ.1.42 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రధాన టెలికం ఆపరేటర్లు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా ఇప్పుడు దీనిపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టెల్కోల కష్టాలపై కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 

also read ఎయిర్‌టెల్... ఐడియా... ఏది బెస్ట్ ?

ఈ కార్యదర్శుల కమిటీకి క్యాబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబా నేతృత్వం వహిస్తారు. ఆర్థిక, న్యాయ, టెలికం శాఖల కార్యదర్శులు ఈ కమిటీలో ఉండనున్నారు. సోమవారం భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌, ఆయన సోదరుడు రాజన్‌ మిట్టల్‌.. టెలికం శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసా ద్‌, ఆ శాఖ కార్యదర్శి అన్షు ప్రకాశ్‌లను కలిసి పరిశ్రమను ఆదుకోవాలని కోరిన నేపథ్యంలో మంగళవారం కమిటీ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకున్నది. 

కాగా, టెలికం సంస్థలు ఎదుర్కొంటున్న అన్ని రకాల ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లపై కమిటీ అధ్యయనం చేయనుండగా, వారి డిమాండ్లనూ పరిశీలించనున్నది. అలాగే ఓ ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ కోసం కూడా కమిటీ శ్రమించనున్నది. ఈ క్రమంలోనే ఆయా టెలికం సంస్థల ఆదాయం పెరిగే మార్గాలను కమిటీ అన్వేషించనున్నది.

దీంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు అందిస్తున్న ఉచిత ఆఫర్లన్నింటినీ వెనుకకు తీసుకోవాలన్న సూచనల్ని కమిటీ చేసే వీలు ఉన్నదని టెలికం శాఖ వర్గాల సమాచారం. పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వానికి ఈ సిఫార్సులను కమిటీ చేయనుందంటున్నారు. 

ఇందులో భాగంగానే టెలికం కంపెనీల ఆదాయాన్ని ప్రభావితం చేస్తున్న ఉచిత మొబైల్‌ ఫోన్‌ కాల్స్‌, చౌక డాటా ఆఫర్లను ఆపేయాలని కేంద్రానికి కమిటీ నివేదిక ఇవ్వవచ్చని తెలుస్తున్నది. ఇదే జరిగితే బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీ కింద టెలికం సంస్థలకు కేంద్రం ఈ మేరకు సూచనలు చేయవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

also read టెలికం ప్రొవైడర్లకు భారీ షాక్‌...

టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌.. వాయిస్‌ ఫోన్‌ కాల్స్‌, డాటా సర్వీసులకు కనీస చార్జీలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు అన్ని సంస్థలు వీటిని విధిగా పాటించాల్సిందే. ఇటీ వలే జియో ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ చార్జీ (ఐయూసీ)లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 

దీంతో టాప్‌ అప్‌లు తెరపైకి రాగా, కస్టమర్లలో వ్యతిరేకత క్తమవుతున్నది. అలాంటిది ఉచిత కాల్స్‌ ఆఫర్‌ కూడా దూరమైతే మొబైల్‌ కస్టమర్లపై మరింత భారం పడనున్నది. అలాగే ఎడాపెడా ఇంటర్నెట్‌ వినియోగిస్తున్న కస్టమర్లకూ ధరల మోత మోగనున్నది. 

రిలయన్స్‌ జియో రాకతో దేశీయ టెలికం పరిశ్రమ ముఖచిత్రం మారిపోగా, ఉచిత కాల్స్‌, చౌక డాటా ఆఫర్లకు తెర లేచింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు ఇంటర్నెట్‌ లభిస్తున్నది భారత్‌లోనే. ఒక జీబీ డాటా ఖరీదు రూ.8గా ఉన్నది.

ఏజీఆర్‌పై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో బకాయిలపై వడ్డీ, జరిమానాలు వద్దని కేంద్రాన్ని ప్రభావిత టెలికం సంస్థలు కోరాయి. అసలు బకాయిల చెల్లింపునకు పదేళ్ల గడువు కావాలని ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. టెలికం శాఖ నిర్వచించిన ఏజీఆర్‌ను సుప్రీం సమర్థించడంతో ఎయిర్‌టెల్‌ దాదాపు రూ.42 వేల కోట్లు, వొడాఫోన్‌ ఐడియా సుమారు రూ.40 వేల కోట్లు, జియో రూ.14 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చేలా ఉంది. 

మిగతా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌తోపాటు మూతబడిన సంస్థలు చెల్లించాలి. ముఖ్యంగా ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌లపై పెను భారమే పడుతున్నది. మూడు నెలల్లో రూ.80 వేల కోట్లకుపైగా చెల్లించాల్సి ఉన్నది. వీటిపై వడ్డీ, జరిమానాలు వర్తిస్తాయని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి టెల్కోలు పైవిధంగా విజ్ఞప్తి చేస్తున్నాయి. 

మరోవైపు ఏజీఆర్‌ అంశాన్నే ప్రధానంగా తీసుకుని కమిటీ ముందుకెళ్లాలని భారతీయ సెల్యులార్‌ ఆపరేటర్ల సంఘం (సీవోఏఐ) విజ్ఞప్తి చేసింది. అలాగే 60 రోజుల్లోగా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలను సూచిస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. మంగళవారం కమిటీ ఏర్పాటు చేయడాన్ని సీవోఏఐ ప్రధాన కార్యదర్శి రాజన్‌ మాథ్యూస్‌ స్వాగతించారు. దేశీయ టెలికం పరిశ్రమలో నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా కమిటీ సిఫార్సులు ఎంత త్వరగా వస్తే అంత మంచిదన్నారు.

also read ఇక వార్ జియో x ఎయిర్‌టెల్ మధ్యే...

స్పెక్ట్రం చార్జీల భారాన్ని మోయలేకున్నామని టెలికం కంపెనీలు ప్రభుత్వంతో మొర పెట్టుకున్న విషయం తెలిసిందే. జియో రాకతో మార్కెట్‌లో పోటీ పెరిగి అప్పటిదాకా ఉన్న సంస్థల ఆదాయానికి గండి పడటంతోపాటు భారీ నష్టాలు వాటిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధిక స్పెక్ట్రం చార్జీలపై టెల్కోలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా, వీటిని కమిటీ పరిశీలించనున్నది.

త్వరలో ప్రారంభమయ్యే 5జీ స్పెక్ట్రం వేలంలోనూ తాము పాల్గొనలేమని టెల్కోలు ప్రభుత్వానికి సంకేతాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్పెక్ట్రం చార్జీలు తగ్గనున్నాయన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇదిలావుంటే తమ వార్షిక ఆదాయంలో ఐదు శాతం యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌కు ఇవ్వాలన్న నిబంధనను సడలించాలని, తక్కువ మొత్తాన్ని నిర్ణయించాలని టెలికం ఆపరేటర్లు డిమాండ్‌ చేస్తుండగా, దీన్ని కూడా కమిటీ పరిశీలించే వీలుంది.
 

click me!