కేంద్ర ప్రభుత్వం విమాన ప్రయాణికులకు తీపి కబురు అందించింది. విమానాల్లో ఇంటర్నెట్ సేవలను అందించేందుకు భారత విమానయాన శాఖ ఆమోదం తెలిపింది. ఈ సేవలను మొదటగా తమ బోయింగ్ 787-9 విమానంలో అందించనున్నట్లు విస్తారా సంస్థ తెలిపింది.
విమానాల్లో వైఫై సేవలు అందించేందుకు భారత ప్రభుత్వం సోమవారం అనుమతించింది. ప్రయాణికులు వై-ఫై సాయంతో ఇంటర్నెట్ సౌకర్యం పొందేందుకు పౌర విమానయాన శాఖ ఆమోదం తెలుపుతూ ప్రకటన జారీ చేసింది. దీంతో ఇకపై ఎగురుతున్న విమానాల్లో కూడా వై-ఫై ద్వారా ఇంటర్నెట్ సేవలను ఉపయోగించుకునే వెసులుబాటు సర్కార్ కల్పించనున్నది.
‘విమానాల్లో వై-ఫై ద్వారా అంతర్జాల సేవలు పొందవచ్చు. ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, స్మార్ట్‌వాచ్, ఈ-రీడర్ లేదా పాయింట్ ఆఫ్ సేల్.. ఇలా ఏ పరికరంలో అయినా ఇంటర్నెట్ ఉపయోగించుకోవచ్చు. అయితే ఆ పరికరాలు ఫ్లయిట్ మోడ్ లేదా ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంటేనే పైలట్ ఇన్ కమాండ్ అనుమతిస్తారు’ అని ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ పేర్కొంది.
undefined
అయితే విమానంలో నిబంధనల ప్రకారం ఇంటర్నెట్ సేవలు అందించే వసతులు ఉన్నాయని పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ ధ్రువీకరించాల్సి ఉంటుందని వెల్లడించింది. విమానంలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచే ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది.
ఈ మేరకు 2018లో భారత టెలికం నియంత్రణ సంస్థ (టాయ్) తన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. భారత గగనతలంలో ఎగురుతున్న విమానాల్లో ఇన్-ఫ్లైట్ కనెక్టివిటీ సేవల పేరుతో ఇంటర్నెట్, మొబైల్ కమ్యూనికేషన్ వసతి కల్పించడానికి అనుమతి ఇవ్వాలని ట్రాయ్ కోరింది.
ప్రభుత్వ అనుమతులు లభించిన నేపథ్యంలో భారత్‌లోని ఖరీదైన విమానయాన సంస్థల్లో ఒకటైన విస్తారా మొదటగా వైఫై సేవలను అందించనుంది. గత శుక్రవారం విస్తారా తొలి బోయింగ్ 787-9 విమానాన్ని వాషింగ్టన్‌లో అందుకుంది. భారత్‌లో విమానాల్లో వైఫై సేవల్ని అందించనున్న తొలి విమానం ఇదే కానుందని ఆ సంస్థ సీఈఓ లెస్లై థంగ్ప్రకటించారు.