ఉచితమైనా.. కాల్స్ క్వాలిటీపై నో కాంప్రమైజ్: ట్రాయ్

By telugu news team  |  First Published Mar 2, 2020, 2:56 PM IST

నాణ్యత లేమికి ఉచిత వాయిస్​ కాల్స్​ ఇవ్వడమే కారణమన్న  టెలికాం సంస్థల వాదనను ట్రాయ్​ ఛైర్మన్​ ఆర్​ఎస్​.శర్మ కొట్టి పారేశారు. కాల్స్​ నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు. నాణ్యమైన సేవలు అందించని ఆపరేటర్లను శిక్షిస్తామని హెచ్చరించారు.
 


ఉచితంగా వాయిస్‌ కాల్స్‌ ఇవ్వడమే ఫోన్‌ కాల్స్‌లో నాణ్యత లేకపోవటానికి కారణమని టెలికాం సంస్థలు చెప్పడం సరికాదని టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ స్పష్టం చేశారు. ఆ సమాధానం ట్రాయ్‌ నిబంధనల్ని సమాధానపరచలేదని, ఫోన్‌ కాల్స్‌లో నాణ్యత విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

కాల్‌ డ్రాప్స్‌పై ట్రాయ్‌ విధించిన నిబంధన విషయంలో సుప్రీంకోర్టు తమకు ప్రతికూల తీర్పు ఇచ్చినప్పటికీ.. సేవల నాణ్యతను పెంచేందుకు చేసే ప్రయత్నాలు ఆగవని ట్రాయ్‌ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ పేర్కొన్నారు. గత కొంతకాలంగా.. దాదాపు అన్ని నెట్‌వర్క్‌లకు సంబంధించిన వినియోగదారులు కాల్స్‌ నాణ్యత విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Latest Videos

వినియోగదారులు తరచూ కాల్‌డ్రాప్ సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ట్రాయ్‌ ఛైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.రాబోయే కాలంలో కాల్స్‌ నాణ్యత మెరుగుపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 

ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగిన ఆసియా ఎకనమిక్‌ డైలాగ్‌ సమావేశంలో కాల్‌ డ్రాప్స్‌పై ట్రాయ్‌ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ మాట్లాడారు. రోడ్లు, రైళ్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లో ఫోన్‌ కాల్స్‌ నాణ్యతను పరిశీలించి, సరైన సేవలందించని సంస్థలు, నాసిరకం సేవలందిస్తున్న సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

టెలికాం టవర్లతో  ఎటువంటి అనారోగ్యాలు రావని, వాటి ఏర్పాటుకు ప్రజలు సహకరించాలని ట్రాయ్‌ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ కోరారు. మారుమూల ప్రాంతాల్లో సైతం టెలికాం మౌలికవసతుల్ని కల్పించడం ద్వారా వేగవంతమైన నెట్‌వర్క్‌ సేవలు ప్రజలకు లభిస్తాయన్నారు. ప్రపంచంలోనే అతి తక్కువ టారిఫ్‌లు ఉన్న కారణంగా భారత టెలికాం సంస్థలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయని వివరించారు. 

5జీ విషయానికొస్తే మౌలిక వసతుల నిర్మాణంపై పెట్టుబడులు, ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ (ఓఎఫ్‌సీ) లైన్ల నిర్మాణం కీలకంగా మారనుందని ట్రాయ్‌ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ అభిప్రాయపడ్డారు. 2016లో రిలయన్స్ జియో రాకతో వాయిస్​ కాల్స్​ ధరలు భారీగా పడిపోయాయి. టెల్కోలు డేటా ప్లాన్లతో కలిపి వాయిస్​కాల్స్​ను ఉచితంగా అందిస్తున్నాయి.

click me!