టెక్కీలకు తీపి కబురు: భారత్‌లో 30 వేల మందికి కొత్త కొలువులు

By narsimha lode  |  First Published Mar 2, 2020, 11:38 AM IST

ఐటీ ఉద్యోగార్థులకు శుభవార్త. ఫ్రాన్స్‌ టెక్నాలజీ దిగ్గజం క్యాప్‌జెమినీ భారత్‌లో మరో 30వేల మందిని ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చూస్తున్నది. క్యాప్‌జెమినీ దేశీయ ఉద్యోగుల సంఖ్య దాదాపు 1.15 లక్షలు. ప్రపంచవ్యాప్తంగా సంస్థకున్న ఉద్యోగుల్లో ఇది సగానికిపైనే. 


న్యూఢిల్లీ: ఐటీ ఉద్యోగార్థులకు శుభవార్త. ఫ్రాన్స్‌ టెక్నాలజీ దిగ్గజం క్యాప్‌జెమినీ భారత్‌లో మరో 30వేల మందిని ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చూస్తున్నది. క్యాప్‌జెమినీ దేశీయ ఉద్యోగుల సంఖ్య దాదాపు 1.15 లక్షలు. ప్రపంచవ్యాప్తంగా సంస్థకున్న ఉద్యోగుల్లో ఇది సగానికిపైనే. 

ఈ క్రమంలో ఈ ఏడాది మరో 25వేల నుంచి 30వేల మందిని నియమించుకునే వీలున్నట్లు క్యాప్‌జెమినీ ఇండియా సీఈవో అశ్విన్‌ యార్డీ పీటీఐకి తెలిపారు. కొత్తవారికి, అనుభవజ్ఞులైన నిపుణులకు అవకాశాలు ఉంటాయని చెప్పారు.

Latest Videos

undefined

‘మా వ్యాపారంలో భారత్‌ చాలా ముఖ్యమైంది. కాబట్టి ఈ ఏడాది మరో 25వేల నుంచి 30వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని భావిస్తున్నాం’ అని యార్డీ అన్నారు. భవిష్యత్ టెక్నాలజీ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంచడంపై ప్రస్తుతం తాము దృష్టి పెట్టినట్లు తెలిపారు. 

ఇందులోభాగంగానే 30 ఏండ్లలోపు యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నట్లు క్యాప్‌జెమినీ ఇండియా సీఈవో అశ్విన్‌ యార్డీ చెప్పారు. అలాగే ప్రాజెక్ట్‌ మేనేజర్లు లేదా ఆర్కిటెక్టులుగా  10-15 ఏండ్ల అనుభవం ఉన్నవారిని తీసుకుంటామని వివరించారు. ముంబై సమీపంలోని తమ భారీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో, మరికొన్ని ఇతర ప్రాంతాల్లో పనిచేయడానికి ఉద్యోగులు కావాలన్నారు.

భారతీయ సంస్థలు నైపుణ్యానికి పెద్దపీట వేస్తున్నాయి. తమ ఉద్యోగుల్లో ప్రతిభకు కొదవే ఉండరాదని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే మెరికల్లాంటి యువతను ఒడిసి పట్టుకోవడానికి ప్రొఫెషనల్‌ ఆర్గనైజేషన్లను ఆశ్రయిస్తున్నాయి. చివరకు సోషల్‌ మీడియా వేదికలు, జాబ్‌ పోర్టల్స్‌నూ విడిచిపెట్టడం లేదు. 

భారతీయ టాలెంట్‌ మార్కెట్‌లో కొత్త ట్రెండ్స్‌పై దృష్టి పెట్టే సీఐఈఎల్‌ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌ ఈ ఏడాది చేపట్టిన అధ్యయనం ప్రకారం జూనియర్‌, మిడ్‌, సీనియర్‌ స్థాయిల్లో పనిచేసేందుకు ప్రతిభావంతుల కోసం ఆయా సంస్థలు ప్రత్యేకంగా కంపెనీలను నియమించుకుంటున్నాయి. దీనివల్ల ఉద్యోగార్థుల పరిశీలన, ఎంపిక, వారిలో నాణ్యమైన ప్రతిభను గుర్తించడం వంటి వాటి కోసం కంపెనీల సమయం ఆదా అవుతున్నదని సీఐఈఎల్‌ తెలిపింది. 

ఈ పని మొత్తం అద్దెకు తీసుకున్న సంస్థలే చూసుకుంటున్నాయని సీఐఈఎల్‌ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌ ఆదిత్య నారాయణ్‌ మిశ్రా స్పష్టం చేశారు. ప్రారంభ స్థాయిల్లో 30 రోజుల్లోగా, మధ్య స్థాయిలో 60 రోజుల్లో, సీనియర్‌ స్థాయిల్లో 180 రోజుల్లోగా నియామకాలు పూర్తవుతున్నట్లు వెల్లడించారు. జూనియర్‌ ఉద్యోగులు జీతాలకు, మధ్య స్థాయి ఉద్యోగులు హోదాలకు , సీనియర్‌ ఉద్యోగులు సంస్థలో కీలక పదవులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు.

click me!