ప్రపంచవ్యాప్తంగా మరోసారి ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమాల సేవలకు అంతరాయం ఏర్పడింది. ఫేస్ బుక్, ఇన్స్ట్రాగ్రామ్ సేవల్లో సమస్య తలెత్తడంతో వినియోగదారులు ఇబ్బందిపడాల్సి వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఉపయోగించే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ఫేస్ బుక్, ఇన్ట్సాగ్రామ్. అయితే ఇవాళ(మంగళవారం) ఈ రెండు ప్లాట్ ఫామ్స్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. మెటాకు చెందిన ఈ రెండు సోషల్ మీడియా యాప్ లు, వెబ్ సైట్ లు పనిచేయలేదు... దీంతో కంటెట్ పోస్ట్ చేయలేకపోయామని వందలాదిమంది ఫిర్యాదులు చేసారు.
ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో కామెంట్స్ లోడ్ కావడంలేదని, పోస్టులు చేయలేకపోతున్నామని వందలాదిమంది యూజర్స్ డౌన్ డిటెక్టర్ కు కంప్లైట్స్ చేస్తున్నారు. ఫేస్ బుక్ లో కూడా ఇలాంటి సమస్యలే ఎదురవుతున్నాయట. అయితే ఈ రెండు సోషల్ మీడియా మాధ్యమాల మాతృ సంస్థ మాత్రం ఇప్పటివరకు ఈ సాంకేతిక సమస్యకు గల కారణాలు వెల్లడించలేదు.
ఇలా గతంలో కూడా సోషల్ మీడియా సేవలకు అంతరాయం ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి. గత ఏడాది చివర్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ తో పాటు మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యల కారణంగా ఇలా కొన్నిసార్లు సేవలకు అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది. తాజా సమస్యను పరిష్కరించేందకు మెటా చర్యలు తీసుకుందో లేదో తెలియాల్సివుంది.