"10 నిమిషాల్లో ఐఫోన్!" - ఈ మాట వింటేనే ఆపిల్ ఫ్యాన్స్‌కి ఎక్కడలేని సంతోషం. జెప్టో సంస్థ ఆపిల్ కంపెనీతో కలిసి ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ లాంటి ఆపిల్ వస్తువుల్ని మెరుపు వేగంతో డెలివరీ చేసే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో ఇకపై యాపిల్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయాలంటే. ఆపిల్ స్టోర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు! వివరాల్లోకి వెళితే..
భారతదేశంలో మెరుపు వేగంతో డెలివరీ చేసే సర్వీసుల్లో ముందుండే జెప్టో సంస్థ, ఆపిల్ కంపెనీతో కలిసి ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ ఇంకా ఇతర ఆపిల్ వస్తువుల్ని 10 నిమిషాల్లో కస్టమర్ల ఇంటి దగ్గరికి డెలివరీ చేసే కొత్త సేవను ప్రారంభించింది.
ఇటీవల వివో స్మార్ట్‌ఫోన్లను ఫాస్ట్ డెలివరీ చేయడం మొదలుపెట్టిన జెప్టో, ఇప్పుడు ఆపిల్ కంపెనీతో కలిసి పనిచేస్తోంది. ఈ కొత్త సర్వీసు కొన్ని ఏరియాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.
జెప్టో సంస్థలోని ఎలక్ట్రానిక్ బిజినెస్ హెడ్ అభిమన్యు సింగ్ మాట్లాడుతూ, "ఆపిల్ కంపెనీకి చెందిన చాలా రకాల వస్తువుల్ని జెప్టోలో అందించడం ద్వారా, టెక్నాలజీని వెంటనే అందుబాటులో ఉంచుతున్నాం. ఇది ఎక్కువ విలువైన గాడ్జెట్లను ప్రజలు కొనే విధానాన్ని మారుస్తుంది" అని చెప్పారు. గత 30 రోజుల్లో 10 లక్షల మందికి పైగా యూజర్లు జెప్టోలో ఆపిల్ వస్తువుల కోసం వెతికారని, ఆపిల్ ప్రొడక్ట్స్ కోసం వెతికేవాళ్ల సంఖ్య నెలనెలా 35 శాతం పెరుగుతోందని ఆయన అన్నారు.
కొత్తగా విడుదల చేసిన ఐఫోన్ 16e, ఎయిర్‌పాడ్స్ 4 ఇంకా కొత్త ఐప్యాడ్ మోడల్స్ జెప్టోలో తొందరగా డెలివరీ చేయడానికి అందుబాటులో ఉంటాయని తెలిపారు. కస్టమర్లు వేర్వేరు బ్యాంక్ కార్డుల ద్వారా కొనేటప్పుడు డిస్కౌంట్లను, కూపన్ డిస్కౌంట్లను, మొబైల్ వాలెట్ ద్వారా డిస్కౌంట్లను పొందొచ్చు. ఇంకా, కస్టమర్లు ఈఎంఐ ఆఫర్లను కూడా పొందొచ్చు.
జెప్టోకి పోటీగా ఉన్న బ్లింకిట్, స్విగ్గి ఇన్ స్టా మార్ట్ లాంటి సంస్థలు కూడా ఆపిల్ వస్తువుల్ని తొందరగా డెలివరీ చేసే సేవను అందిస్తున్నాయి. అదే సమయంలో, బిగ్ బాస్కెట్ సంస్థ క్రోమా ఎలక్ట్రానిక్స్ కంపెనీతో కలిసి బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబైలో ఐఫోన్ 16తో పాటు ఐఫోన్ 16 ప్లస్ మోడల్స్‌ను డెలివరీ చేస్తోంది.
ఈ కొత్త సర్వీసు టెక్నాలజీ ఇష్టపడేవాళ్లకి బాగా ఉపయోగపడుతుంది అని జెప్టో భావిస్తోంది.