నెల రోజుల్లో... బీఎస్ఎన్ఎల్... అమలులోకి

By Rekulapally SaichandFirst Published Oct 22, 2019, 12:08 PM IST
Highlights

ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ పథకం నెల రోజుల్లో అమలులోకి వస్తుందని సంస్థ చైర్మన్ పీకే పూర్వార్ తెలిపారు. దీనికి రూ.74 వేల కోట్లు అవసరం అని చెప్పారు. సంస్థకు ఏటా రూ.1600 కోట్ల లాభాలు వస్తున్నా రూ.1200 కోట్లు వేతనాల చెల్లింపుకే సరిపోతుందన్నారు. 

న్యూఢిల్లీ: బీఎస్‌ఎన్ఎల్ పునరుజ్జీవం కోసం ప్రభుత్వ ప్రణాళిక నెల రోజుల్లో వెలువడే అవకాశం ఉందని ఆ సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీకే పుర్వార్‌ భావిస్తున్నారు. అంతేకాకఈ ఏడాది చివరికల్లా 4జీ స్పెక్ట్రమ్‌ను కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు.

గత కొన్ని నెలలుగా ఉద్యోగుల జీతాల చెల్లింపులో జాప్యం జరిగినా ఈసారి మాత్రం దీపావళికన్నా ముందుగానే ప్రతి ఉద్యోగి వేతనాలను చెల్లిస్తామని బీఎస్ఎన్ఎల్ సీఎండీ పీకే పూర్వార్ చెప్పారు. ఈ నెల 23,24 తేదీల్లోనే వేతనాల చెల్లింపు ఉంటుందన్నారు. 

‘టెలికాం రంగం సవాళ్లను ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. టారిఫ్‌లు  చాలా పోటీవంతంగా ఉన్నందు వల్ల అందరు ఆపరేటర్లు కూడా ఆర్థిక పరంగా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు వారసత్వ సమస్యలున్నాయి. సంస్థలో చాలా మంది ఉద్యోగులు పని చేస్తున్నందు వల్ల మరిన్ని సమస్యలు ఉన్నాయి.

also read ప్రైమ్ వీడియోలకు సెన్సార్ గండం తప్పదా?

ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంస్థ పునరుజ్జీవానికి సంబంధించిన ప్రణాళిక త్వరలోనే వెలువడుతుందని ఆశిస్తున్నాం’ పుర్వార్‌ పేర్కొన్నారు. నెలలోపే సంస్థ పునరుద్ధరణ ప్రణాళికకు మోక్షం లభిస్తుందని ఆశాభావంతో ఉన్నట్లు బీఎస్ఎన్ఎల్ చైర్మన్ పీకే పూర్వార్ తెలిపారు.

తమ సంస్థ మార్కెట్‌ లీడర్‌గా ఉందని, రూ.20,000 కోట్లకు పైగా రాబడిని నమోదు చేసుకుంటున్న కంపెనీ తమదని తెలిపారు. అయితే సంస్థకు రూ.1600 కోట్ల లాభాలు వస్తున్నాయని, అందులో రూ.1200 వేతనాలు, మిగతా వ్యయాలకు రూ.400-500 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. 

సంస్థ పునరుద్ధరణ ప్యాకేజీ అమలుకు రూ.74 వేల కోట్లు అవసరం. భారీగా ఉన్న సంస్థ ఆస్తులను వాణిజ్యపరంగా వినియోగించుకుంటే ప్రభుత్వం ఆ భారీ మొత్తాన్ని రికవరీ చేసుకుంటుందని భావిస్తున్నారు. డిసెంబర్ నెలాఖరులోగా 4జీ స్పెక్ట్రం కేటాయిస్తే 12-15 నెలల్లో పూర్తిస్థాయిలో సేవలను విస్తరిస్తామని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ పీకే పూర్వార్ తెలిపారు.

also read స్మార్ట్ ఫోన్లలో కెమెరాల వార్ మొదలైంది

ఇదిలా ఉంటే హైదరాబాద్‌కు చెందిన యప్‌ టీవీ, బీఎ్‌సఎన్‌ఎల్‌ మధ్య ఒప్పందం కుదిరింది. బీఎస్ఎన్ఎల్ మొబైల్‌, ఫిక్స్‌డ్‌ లైన్‌ కస్టమర్లకు వీడియో, బ్రాడ్‌బ్యాండ్‌ టెక్నాలజీ సర్వీసులను అందించేందుకు ఈ ఒప్పందం కుదిరింది. సోమవారం ఢిల్లీలో ఒప్పంద పత్రాలపై బీఎస్ఎన్ఎల్ సీఎండీ పీకే పుర్వార్‌ సమక్షంలో యప్‌ టీవీ వ్యవస్థాపకుడు ఉదయ్‌ రెడ్డి, బీఎస్ఎన్ఎల్సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ అగర్వాల్‌ సంతకాలు చేశారు. 

ఈ సందర్భంగా ఉదయ్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే ఆఫర్లు, సేవలు వెల్లడిస్తామన్నారు. తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా వరంగల్‌, కరీంనగర్‌లతో పాటు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తామని వివరించారు. బీఎస్ఎన్ఎల్ సంస్థలో 2009 నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ ఒప్పందం కింద ఉద్యోగుల పదవీ విరమణ పెండింగ్ లో ఉంది. 2015 నుంచే 4జీ కేటాయించాలని బీఎస్ఎన్ఎల్ కోరుతున్నా కేంద్రం పెడచెవిన బెడుతున్నదన్న విమర్శలు హోరెత్తుతున్నాయి. 

click me!