టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నా కొద్దీ రకరకాల కంటెంట్‌తో ఆన్ లైన్ ప్రైమ్ వీడియో సంస్థలు దూసుకొస్తున్నాయి. ప్రత్యేకించి నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటి సంస్థలు మరింత పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో భారత చట్టాలు, పద్ధతులు, సంప్రదాయాలకు అనుగుణంగా సెన్సార్ షిప్ విధించాలని కేంద్రం తలపోస్తోంది.
ఆన్ లైన్ స్ట్రీమింగ్ రంగంలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ తదితర ఓవర్ ది టాప్ (ఓటీటీ) సేవలు అందిస్తున్న సంస్థలకు ప్రభుత్వం నుంచి ఆంక్షలు ఎదురు కానున్నాయి. ఎందుకంటే ఆయా సంస్థలు అందించే కంటెంట్ విషయమై సెన్సార్ విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి ఒక వార్తా సంస్థకు చెప్పారు.
కొన్ని స్ట్రీమింగ్ సంస్థల్లోని కంటెంట్ అసభ్యకరంగానూ, మత పరంగా ఘర్షణలు రేకెత్తించేలా ఉన్నదని పలు న్యాయస్థానాల్లో కేసులు, పోలీస్ స్టేషన్లలో పలు ఫిర్యాదులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. అందుకే టీవీ, సినిమాలతోపాటు ఓటిటీ కంటెంట్‌కు కూడా సెన్సార్ విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నదని తెలిపారు.
undefined
‘కంటెంట్ విషయంలో ఫిర్యాదుల నేపథ్యంలో ఎవరికి వారు స్వీయ నియంత్రణ ఏర్పరుచుకోవాలని కోరుతూ ఈ ఏడాది ప్రారంభంలో కొన్ని సంస్థలకు సూచించాం. ఇందుకోసం సంతకాలు చేయాలని కూడా కోరాం. కానీ ఆ సంస్థల ప్రతినిధులు ప్రస్తుతం ఉన్న నిబంధనలు సరిపోతాయని చెప్పారు’ అని ఆ అధికారి తెలిపారు.
నెట్ ఫ్లిక్స్‌కు సంబంధించిన తొలి ఇండియన్ వెబ్ సిరీస్ ‘సీక్రెడ్ గేమ్స్’లో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని గతేడాది కొందరు న్యాయస్థానం మెట్లెక్కారు. కానీ కోర్టు దాన్ని తోసిపుచ్చింది. మరో వెబ్ సిరీస్‌లో హిందువులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఇటువంటి పలు అభ్యంతరాల నేపథ్యంలో కంటెంట్ విషయమై సరైన మార్గదర్శకాలను రూపొందించడానికి తాము కేంద్ర సమాచార ప్రసార, ఐటీ శాఖల అధికారులతో చర్చిస్తున్నామని ఆ అధికారి తెలిపారు. అయితే, దీనిపై ఆయా మంత్రిత్వశాఖల అధికారులు స్పందించలేదు.
భారతదేశంలో మొబైల్ డేటా వినియోగం పెరిగిన నేపథ్యంలో చాలా సంస్థలు ఓటీటీ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎక్కువగా స్థానికంగా కంటెంట్ తో వీక్షకులను ఆకర్షించుకోవడానికి అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ మరింత పోటీ పడుతున్నాయి.