కేంద్ర టెలికం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌ల్లో పని చేస్తున్న వారిలో సుమారు 92,700 మంది వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో సంస్థలపై ఏటా రూ.8,800 కోట్ల వేతన బిల్లు భారం తగ్గనున్నది.
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకం(వీఆర్‌ఎస్)కు సిబ్బంది నుంచి విశేష స్పందన లభించింది. బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీఆర్ఎస్ పథకానికి 92,700 మందికి పైగా వీఆర్‌ఎస్ దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు మంగళవారంతో గడువు ముగిసింది. ఇందుకు ఇరు సంస్థలకు ప్రతి ఏటా రూ. 8800 కోట్లు ఆదా కానున్నాయి.
వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నవారిలో బీఎస్‌ఎన్‌ఎల్‌లో 78,300 మంది సిబ్బంది ఉండగా, ఎంటీఎన్‌ఎల్‌లో 14,378 మంది ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 82 వేల మంది వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకుంటారని భావించినా 78 వేల మంది వీఆర్ఎస్ కోసం ముందుకు వచ్చారని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ పీకే పూర్వార్ చెప్పారు.
also read Video news : సంవత్సరంలో 405% పెరిగిన మొబైల్ డౌన్‌లోడ్‌లు
వీరితోపాటు 6 వేల మంది సిబ్బంది పదవీ విరమణ చేశారని బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ పీకే పుర్వార్ తెలిపారు. ప్రస్తుతం వార్షిక వేతన బిల్లు రూ.14 వేల కోట్లు ఉందని, అది రూ.7000 కోట్లకు తగ్గుతుందని పూర్వార్ చెప్పారు. కానీ, మరో సంస్థ ఎంటీఎన్‌ఎల్‌లో లక్ష్యానికి మించి దరఖాస్తు చేసుకున్నారు. 13,650 మంది వీఆర్‌ఎస్‌ను ఎంపిక చేసుకుంటారని అనుకున్నా 14,378 మంది దరఖాస్తుచేసుకున్నారని ఎంటీఎన్‌ఎల్ సీఎండీ సునీల్ కుమార్ వెల్లడించారు.
దీంతో కంపెనీ వార్షిక వేతనాలు రూ.2,272 కోట్ల నుంచి రూ.500 కోట్లకు తగ్గనున్నాయి. తమకు కార్యకలాపాల నిర్వహణ కోసం 4,430 మంది సిబ్బంది సరిపోతారని సునీల్ కుమార్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థల వేతన బిల్లు భారీగా ఉండటంతోనే అప్పుల్లో చిక్కుకున్నాయి. ఫలితంగా నష్టాల బారిన పడ్డాయన్న విమర్శలు ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ రూ.14,904 కోట్లు, ఎంటీఎన్ఎల్ రూ.3,398 కోట్ల మేరకు నష్టపోతున్నది. రెండు సంస్థల రుణ భారం సుమారు రూ.40 వేల కోట్లు. ఈ నేపథ్యంలో కేంద్రం రూ.68,751 కోట్ల రివైవల్ ప్యాకేజీని ప్రకటించింది.
also read రియల్‌మీ బంపర్ ఆఫర్.. భారీగా తగ్గించిన ఫోన్ ధరలు
ఇందులో వీఆర్ఎస్ కింద చెల్లింపులకు రూ.17,169 కోట్లు, పెన్షన్ తదితర బెనిఫిట్ల కోసం రూ.12,768 కోట్లు ఉన్నాయి. పదేళ్ల ముందే పెన్షన్ బెనిఫిట్లు అందజేయనున్నారు. ఈ పథకం కింద బీఎస్ఎన్ఎల్ సంస్థలో లక్ష మందికి పైగా ఎంటీఎన్ఎల్ సంస్థలో 16,300 మంది అర్హులు. గతనెల నాలుగో తేదీన ఈ పథకం అమలులోకి వచ్చింది.