ప్రపంచంలో లీడింగ్ వెబ్ బ్రౌజర్లుగా వున్న గూగుల్ క్రోమ్, మోజిల్లా ఫైర్‌ఫాక్స్ , మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ , ఓపెరా తదితర వాటికి దెబ్బ కొట్టేందుకు మోడీ సర్కార్ రెడీ అయ్యింది. ఆత్మనిర్భర్ భారత్ కింద స్వదేశీ వెబ్ బ్రౌజర్‌ను రూపొందించే పనిలో వుంది.
"ఆత్మనిర్భర్" (స్వయం సమృద్ధి)కి పొడిగింపుగా, గూగుల్ క్రోమ్, మోజిల్లా ఫైర్‌ఫాక్స్ , మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ , ఓపెరా తదితర బ్రౌజర్లతో పోటీపడే స్వదేశీంగా నిర్మించిన వెబ్ బ్రౌజర్‌లకు మద్దతు ఇచ్చే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. వెబ్ బ్రౌజర్ డెవలప్‌మెంట్ ఛాలెంజ్ నిమిత్తం రూ. 3 కోట్లకు పైగా గ్రాంట్‌లను అందించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ దాని అనుబంధ విభాగాలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తాయి.
భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మన డిజిటల్ విధానాలపై మనకు నియంత్రణ ఉండటం ముఖ్యమని ఓ అధికారి పేర్కొన్నారు. పౌరుల భద్రతతో పాటు దేశ భద్రత వంటి అత్యంత కీలకమైన ఏరియాల్లో తాము విదేశీ వెబ్ బ్రౌజర్‌లపై ఆధారపడకూడదనుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. వెబ్ బ్రౌజర్‌లలోనూ ‘‘ఆత్మనిర్భర్త’’ వుండాలని ఆ అధికారి పేర్కొన్నారు.
undefined
నివేదికల ప్రకారం .. గూగుల్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వంటి అమెరికా కేంద్రంగా పనిచేసే బ్రౌజర్ కంపెనీలను వెబ్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ అథారిటీకి చెందిన ట్రస్ట్ స్టోర్స్‌లో చేర్చడానికి భారత్ ఒప్పించేందుకు యత్నిస్తోంది. తాజా ప్రోగ్రామ్ కారణంగా భారత్‌కు బేరసారాల శక్తి మరింత పెరుగుతుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. బ్రౌజర్‌కు ట్రస్ట్ స్టోర్ లేదా రూట్ స్టోర్ సర్టిఫికేట్ అనేది విశ్వసించగల ధృవీకరణ అధికారుల జాబితాను కలిగి ఉంటుంది. ప్రస్తుతం, గూగుల్ క్రోమ్, మోజిల్లా ఫైర్ ఫాక్స్ వంటి అగ్రశ్రేణి బ్రౌజర్‌లు తమ రూట్ స్టోర్‌లలో భారతదేశ అధికారిక ధృవీకరణ ఏజెన్సీని చేర్చలేదు.
దాదాపు 850 మిలియన్ల వినియోగదారులతో భారతదేశం ఇంటర్నెట్ మార్కెట్‌లో తిరుగులేని ఆధితపత్యాన్ని కలిగి వుంది. జూలై నాటి వెబ్ డేటా ప్రకారం.. గూగుల్ క్రోమ్ 88.47 శాతం మార్కెట్ వాటాతో లీడింగ్‌లో వుంది. ఆ తర్వాత సఫారి 5.22 శాతంతో రన్నరప్‌గా ఉంది, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ 2 శాతం, శామ్‌సంగ్ ఇంటర్నెట్ 1.5 శాతం, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ 1.28 శాతం , ఇతర బ్రౌజర్‌లు 1.53 శాతంతో నిలిచాయి.
స్వదేశీ వెబ్ బ్రౌజర్‌ల అభివృద్ధి, ప్రారంభం 2024 చివరి నాటికి పూర్తవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ స్టార్టప్‌లు, విద్యా సంస్థలు, కార్పొరేషన్‌లను ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కేంద్రం ఇప్పటికే ఆహ్వానించింది. దేశీయ వెబ్ బ్రౌజర్‌ల స్వీకరణలో కూడా ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఇవి వెబ్3 కంప్లైంట్‌గా ఉండటమే కాకుండా క్రిప్టో టోకెన్‌ల ద్వారా డిజిటల్ సిగ్నేచర్‌లను ఎనేబుల్ చేయడం, భారతీయ భాషలకు మద్దతు ఇవ్వడం వంటి స్వదేశీ ఫీచర్‌లను కూడా కలిగి వుంటాయని అధికారి తెలిపారు.