స్మార్ట్‌ఫోన్ రాకతో ప్రపంచం మారిపోయింది. రోజూ గంటలతరబడి ఫోన్‌లతో కుస్తీ పడే వారి సంఖ్య పెరుగుతోంది. స్కూలుకు వెళ్లే పిల్లల నుంచి రిటైర్ అయిన ఉద్యోగి వరకు ఫోన్‌లతో గడుపుతున్నారు. భారతదేశంలో సగటున ఒక వ్యక్తి ఎన్ని గంటలు ఫోన్‌ను ఉపయోగిస్తున్నారో తెలుసా.? తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి..
ఇండియాలో 1.2 బిలియన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు, 950 మిలియన్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారని తాజా అధ్యయనంలో తేలింది. తక్కువ ధరకే మొబైల్స్, ఇంటర్నెట్ ప్యాక్స్ ఉండటంతో దేశంలో డిజిటలైజేషన్ బాగా పెరిగింది. అయితే, చాలామంది భారతీయులు ఫోన్లకు బానిసలై గంటల తరబడి మీడియా చూస్తూ గడుపుతున్నారని గణంకాలు చెబుతున్నాయి.
గ్లోబల్ మేనేజ్‌మెంట్ సంస్థ EY ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. భారతీయులు మునుపెన్నడూ లేనంతగా స్మార్ట్ ఫోన్ లను ఉపయోగిస్తున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఇండియన్ యూజర్లు రోజుకు ఐదు గంటలు సోషల్ నెట్‌వర్కింగ్, గేమింగ్, వీడియోలు చూస్తూ గడుపుతున్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అందుబాటులో ఇంటర్నెట్ ఉండటం, డిజిటల్ యాక్సెస్ పెరగడంతో మీడియా వినియోగం ఎలా మారుతుందో ఈ స్టడీ చెబుతోంది.
డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్ సంఖ్య పెరగడంతో ఇండియా మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్‌లో టీవీని దాటి డిజిటల్ ముందంజలో ఉంది. 2024లో ఇది రూ. 2.5 ట్రిలియన్లు ($29.1 బిలియన్లు) ఉంటుందని EY అధ్యయనంలో తేలింది.
ఇదిలా ఉంటే, సోషల్ నెట్‌వర్కింగ్, వీడియోలు చూడటం, గేమింగ్ వంటి వాటితో భారతీయులు స్క్రీన్‌పై గడిపే టైమ్‌లో 70% ఉంటుందని తేలింది. అంటే రోజుకు దాదాపు ఐదు గంటలు వీటికే కేటాయిస్తున్నారు.
ఈ రీసెర్చ్ ప్రకారం, ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ మార్కెట్ గా మారింది. 2024లో ప్రజలు 1.1 ట్రిలియన్ గంటలు గడిపారు. డైలీ మొబైల్ స్క్రీన్ టైమ్ పరంగా బ్రెజిల్, ఇండోనేషియా తర్వాత ఇండియా మూడో స్థానంలో ఉంది. ఎలాన్ మస్క్, ముఖేష్ అంబానీ వంటి బిలియనీర్లు, అమెజాన్, మెటా వంటి ఐటీ దిగ్గజాలు తమ కంపెనీలను పెంచుకోవడానికి, భారత డిజిటల్ మార్కెట్‌ను హస్తగతం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఎందుకంటే ఇండియాలో ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య పెరుగుతోంది.
డిజిటల్ మీడియా వినియోగం పెరుగుతుంటే, టీవీ, ప్రింట్, రేడియో వంటి సాంప్రదాయ మీడియా ఆదాయం, మార్కెట్ షేర్ రెండూ 2024లో తగ్గాయని రిపోర్ట్ చెబుతోంది.