తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు: సినీ నటి ఖుష్బూకు షాక్, గౌతమికి సైతం...

By telugu teamFirst Published Mar 12, 2021, 7:28 AM IST
Highlights

తమిళనాడు శానససభ ఎన్నికల్లో సినీతారలు ఖుష్బూ, గౌతమిలకు తీవ్ర నిరాశ ఎదురైంది. వారు చేయాలనుకున్న సీట్లను అన్నాడియంకె బిజెపికి కేటాయించేందుకు నిరాకరించింది. దీంతో వారికి నిరాశ తప్పలేదు.

చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో సినీ తారలు ఖుష్బూ, గౌతమిలకు తీవ్ర నిరాశ ఎదురైంది. తాము పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం వారికి రాలేదు. చేపాక్కం - ట్రిప్లికేన్ నియోజకవర్గం నుంచి తానే బిజెపి తరఫున పోటీ చేస్తానని భావిచిన ఖుష్బూ గత ఆరు నెలలుగా శ్రమిస్తూ వచ్చారు. ఆమె నియోజకవర్గంలో ఉంటూ ఓటర్లను తన వైపు ఆకర్షించే కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. 

ఆ నియోజకవర్గంలో ఖుష్పూ సినీ సెట్టింగ్ తరహాలో ఆమె ఎన్నికల కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు కంటైనర్లు ఏర్పాటు చేశారు. అందులో అన్ని రకాల వసతులను కల్పించుకున్నారు. ప్రతి రోజూ సేవా కార్యక్రమాలు, ప్రచారాలు, ర్యాలీలు చేపడుతూ వచ్చారు. ఆరు నెలలుగా ఆమె నియోజకవర్గంలో చెమటోడ్చారు. అయితే ఆ సీటును పొత్తులో భాగంగా అన్నాడియంకే నుంచి రాబట్టుకోవడంలో బిజెపి విఫలమైంది. 

మరో సినీ నటి గౌతమికి సైతం అదే పరిస్థితి ఎదురైంది. గౌతమి చేరిన తర్వాతనే సినీ తారలు గాయత్రి రఘురాం, నమిత వంటివారు బిజెపిలోకి వచ్చారు. ఖుష్బూను చేపాక్కం ఇంచార్జీగా, గౌతమిని విరుదనగర్ జిల్లా రాజపాళయం ఇంచార్జీగా బిజెపి నాయకత్వం నియమించింది.  దాంతో ఇక్కడి నుంచి తాను పోటీ చేయడం ఖాయమని గౌతమి భావించారు. అయితే, ఆ సీటును బిజెపికి ఇవ్వడానికి అన్నాడియంకె నిరాకరించింది. దాంతో గౌతమికి నిరాశ తప్పలేదు. 

ఐదు నెలలుగా ప్రతి ఇంట్లోనూ తనను ఓ బిడ్డగా, సౌదరిగా చూసుకున్నారని గౌతమి రాజపాళయం ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. మెలాపూర్ నుంచి బిజెపి సీనియర్ నేత కరు నాగరాజన్, తిరుత్తణి నుంచి మరో సీనియర్ నేత చక్రవర్తి నాయుడు పోటీ చేసే అవకాశాలున్నట్లు భావించారు. అయితే, ఆ సీట్లను కూడా అన్నాడియంకే బిజెపికి ఇవ్వడానికి నిరాకరించింది.

click me!