Tokyo Paralympics:బ్యాడ్మింటన్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లిన ప్రమోద్ భగత్, కనీసం రజతం ఖాయం

By team teluguFirst Published Sep 4, 2021, 8:00 AM IST
Highlights

జపాన్ కి చెందిన స్టార్ ప్లేయర్ ఫుజియారా పై 21-11, 21-16 పాయింట్లతో వరుస గేముల్లో నెగ్గి ప్రమోద్ భగత్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లాడు. 

పారా ఒలింపిక్స్ లో భారత ఆటగాళ్లు పతకాల పంట పండిస్తూనే ఉన్నారు. నేటి ఉదయం జరిగిన సెమి ఫైనల్ మ్యాచ్ లో భారత స్టార్ పారా బాడ్మింటన్ ప్లేయర్, వరల్డ్ నెంబర్ 1 ప్రమోద్ భగత్ ఫైనల్స్ లోకి ప్రవేశించి భారత్ కి కనీసం రజతపతకాన్ని ఖాయం చేసాడు. 

జపాన్ కి చెందిన స్టార్ ప్లేయర్ ఫుజియారా పై 21-11, 21-16 పాయింట్లతో వరుస గేముల్లో నెగ్గి ప్రమోద్ భగత్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లాడు. ఆది నుంచి కూడా ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ప్రమోద్ ఎక్కడా కూడా ప్రత్యర్థికి కోలుకునే అవకాదం ఇవ్వకుండా.. మ్యాచ్ ను కైవసం చేసుకొని భారత్ కి బ్యాడ్మింటన్ లో పతకాన్ని ఖాయం చేసాడు. బాడ్మింటన్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లిన ప్లేయర్ గా కూడా రికార్డు సృష్టించాడు ప్రమోద్. 

మరోవైపు మరో భారతీయ ఆటగాడు మనోజ్ సర్కార్ బ్రిటన్ ఆటగాడు డేనియల్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచులో ఓటమి చెంది కాంస్యం కోసం పోరాడనున్నాడు. వాస్తవానికి SL -3 కేటగిరీలో ఇద్దరు భారత్ ప్లేయర్స్ ఫైనల్ ఆడాలని భారతీయ అభిమానులు కోరుకున్నప్పటికీ... బ్రిటన్ ఆటగాడి అద్భుతమైన ఆటతీరు ఆ కలను సాకారం కానివ్వలేదు. జపాన్ ప్లేయర్ ఫుజియారా తో మనోజ్ కాంస్య పతకపోరులో తలపడనున్నాడు. 

మరో ఇద్దరు భారత పారా బాడ్మింటన్ ప్లేయర్స్ సుహాస్ యతిరాజ్, తరుణ్ ఢిల్లన్ కూడా లు కూడా తమ సెమీఫైనల్ మ్యాచులను నేడు ఆడనున్నారు. రేపటితో పారా ఒలింపిక్స్ ముగియనుండగా భారత ప్లేయర్స్ ఎన్నిపతకాలను సాధిస్తారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. 

మరోవైపు షూటింగ్ మిక్స్డ్ 50 మీటర్స్ పిస్టల్ లో భారత ఆటగాళ్లు మనీష్ నర్వాల్,సింగ్ రాజ్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లారు. 

click me!