Tokyo Olympics: స్పెయిన్ పై భారత హాకీ జట్టు అద్భుత విజయం

By team teluguFirst Published Jul 27, 2021, 8:13 AM IST
Highlights

పురుషుల హాకీ పూల్ ఏ లో భారత్ నేడు తన మూడవ మ్యాచులో స్పెయిన్ పై విజయం సాధించింది. 3-0 తేడాతో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి మ్యాచ్ ను కైవసం చేసుకుంది.

పురుషుల హాకీ పూల్ ఏ లో భారత్ నేడు తన మూడవ మ్యాచులో స్పెయిన్ పై విజయం సాధించింది. 3-0 తేడాతో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి మ్యాచ్ ను కైవసం చేసుకుంది. నేటి ఉదయం మ్యాచు ప్రారంభమైనప్పటినుండీ... భారత ప్లేయర్లు చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు. ఆస్ట్రేలియాతో ఆడినప్పుడు వారి ముఖాల్లో,ఆటతీరులో కనిపించిన ప్రెజర్... నేడు వారి ఆటలో కనిపించలేదు. పూర్తి స్వేచ్ఛతో, ఎక్కడా పొరపాటు చేయకుండా తమ ఆటపై పూర్తి ఫోకస్ తో ఈ మ్యాచును కైవసం చేసుకున్నారు. 

తొలి క్వార్టర్లోనే భారత్ కి సిమ్రన్ జీత్ ఒక అద్భుత గోల్ ని అందించాడు. ఆడుతున్న తొలి ఒలింపిక్ మ్యాచులోనే ఈ యువ ఆటగాడు భారత్ గెలుపుకు బాటలు వేసాడు. అందిన శుభారంభాన్ని భారత ఆటగాళ్లు కాపాడుకుంటూ... ప్రత్యర్థి టీం ని ప్రెజర్ లోకి నెట్టి రెండవ క్వార్టర్ చివర్లో పెనాల్టీ కార్నర్ ని ప్రత్యర్థి పై ఫోర్స్ చేసి మరో గోల్ ని సాధించారు. 

పూర్తిగా ఆధిపత్యాన్ని చెలాయిస్తూ భారత్ తమ లీడ్ ని అలానే కాపాడుకుంటూ రెండవ క్వార్టర్ ని కూడా ముగించింది. ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి భారత్ 2-0 తో పటిష్టమైన లీడ్ ని సాధించింది. మూడవ క్వార్టర్ ముగుస్తుండగా ఆఖరి క్షణాల్లో స్పెయిన్ పెనాల్టీ కార్నర్ ని భారత్ పై ఫోర్స్ చేసినప్పటికీ... నేడు అభేద్యమైన ఫామ్ లో ఉన్న భారత డిఫెన్సె దాన్ని సునాయాసంగా అడ్డుకుంది. మూడవ క్వార్టర్ కూడా ముగిసే సమయానికి భారత్ తన 2-0 లీడ్ ను కాపాడుకొని ఎక్కువగా డ్రామాకు తెరలేపకుండా చివరిదైన నాలుగవ క్వార్టర్లోకి ఎంటర్ అయింది. 

ఇక నాలుగవ క్వార్టర్లో భారత్ కి 10 నిమిషాల సమయం ఉండగా... భారత్ కి మరొక పెనాల్టీ కార్నర్ దక్కింది. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ అద్భుతమైన డ్రాగ్ ఫ్లిక్ తో రూపిందర్ పాల్ సింగ్ భారత్ ఆధిక్యాన్ని 3-0 కు పెంచాడు. 

ఆ తరువాత స్పెయిన్ కి వరుసగా మూడు పెనాల్టీ కార్నర్ అవకాశాలు దక్కినప్పటికీ... వారు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. దానికి తోడు భారత డిఫెన్సె కూడా పూర్తి స్థాయిలో స్పెయిన్ ఆశలకు గండి కొట్టింది. నాలుగు నిమిషాలకన్నా తక్కువ సమయం మిగిలి ఉండగా కూడా స్పెయిన్ అందివచ్చిన పెనాల్టీ కార్నర్ ని జారవిడుచుకుంది. భారత గోల్ కీపర్ శ్రీజేష్ మరోసారి గోల్ పోస్ట్ కి అడ్డుగోడలా నిలబడి స్పెయిన్ ఆశలకు గండికొట్టాడు. 

పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత హాకీ ప్లేయర్స్ స్పెయిన్ పై 3-0 తో అద్భుత విజయాన్ని సాధించారు. ఆస్ట్రేలియా పై 1-7 తో ఘోర ఓటమిని చవి చూసిన తరువాత భారత్ తిరిగి పుంజుకోవడం హాకీ అభిమానులను ఆనందంలో ముంచేసింది. 

click me!