టోక్యో ఒలింపిక్స్: క్వార్టర్ ఫైనల్స్‌కి వినేష్ ఫోగట్... నిరాశపర్చిన అన్షూ మాలిక్...

By Chinthakindhi RamuFirst Published Aug 5, 2021, 8:04 AM IST
Highlights

స్వీడెన్ రెజ్లర్ సోఫియా మాట్‌సన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7-1 తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించిన వినేష్ ఫోగట్... 

టోక్యో ఒలింపిక్స్  53 కిలోల కేటగిరీలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్, తొలి రౌండ్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది. స్వీడెన్ రెజ్లర్ సోఫియా మాట్‌సన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7-1 తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది వినేష్ ఫోగట్. 

2016 రియో ఒలింపిక్స్‌లో కూడా భారీ అంచనాలతో బరిలో దిగిన  వినేష్ పోటీ మధ్యలో గాయపడింది. గాయం తీవ్రత కారణంగా లేవడానికి కూడా కష్టపడిన వినేష్, స్ట్రెచర్ మీద బయటకు వెళ్లి, ఒలింపిక్స్ నుంచి తప్పుకోవాలిసి వచ్చింది.  

2016లో 50 కిలోల కేటగిరీలో పోటీపడ్డ వినేష్, 2019 లో 50 కిలోల కేటగిరీ నుండి 53 కిలోల కేటగిరీకి మారింది. ఒలింపిక్స్‌కి కేవలం 18 నెలల ముందు ఇలా వెయిట్ కేటగిరీని మార్చుకోవడం పెనుసవాలే అయినప్పటికీ... తన ప్రతికూలతలపై విజయం సాధించి అధిక వెయిట్ కేటగిరీలో పోరాడడానికి అలవాటుపడింది. 

అంతకుముందు తొలి రౌండ్‌లో ఓడిన భారత రెజ్లర్ అన్షూ మాలిక్‌కి రెపఛేజ్ దక్కినా, దాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయింది. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, చెక్ రిపబ్లిక్‌కి చెందిన వలరియా కోబ్లోవాతో జరిగిన మ్యాచ్‌లో 1-5 తేడాతో పోరాడి ఓడింది అన్షూ...

ఆఖరి 30 సెకన్లలో 4 పాయింట్లు సాధించిన వలరియా, అన్షూపై విజయం సాధించింది. ఈ పరాజయంతో అన్షూ మాలిక్ నిరాశగా ఇంటిదారి పట్టింది. 
 

click me!