టోక్యో ఒలింపిక్స్ 2020లో మిక్స్‌డ్ డబుల్స్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిన టేబుల్ టెన్నిస్ జట్టుకి, సింగిల్స్‌లో మాత్రం శుభారంభం దక్కింది. వుమెన్స్ సింగిల్స్‌లో ఇద్దరు భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లారు...
భారత టీటీ ప్లేయర్ మానికా బత్రా, తొలి రౌండ్‌లో బ్రిటన్‌కి చెందిన టిన్ టిన్ హోపై నాలుగు సెట్లలో విజయం సాధించి, రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. 11-7, 11-6, 12-10, 11-9 తేడాతో టిన్ టిన్‌ను కేవలం 30 నిమిషాల్లోనే మట్టికరిపించింది మానికా బత్రా...
మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో తన కోచ్ శరత్ కమల్‌తో కలిసి బరిలో దిగిన మానికా బత్రా, చైనా తైపాయ్ జోడి యున్ జున్ లిన్, చెంగ్ ఐ చింగ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు సెట్లలో ఓడి తొలి రౌండ్ నుంచే నిష్కమించింది.
undefined
టీటీ మహిళల సింగిల్స్‌లో సుత్రీత ముఖర్జీ, స్విడెన్ ప్లేయర్ బెర్‌స్టోమ్‌తో జరిగిన మ్యాచ్ ఏడు సెట్ల పాటు ఉత్కంఠభరితంగా సాగింది. తొలి సెట్‌ను బెర్‌స్టోమ్ 5-11తేడాతో సొంతం చేసుకున్నా, రెండో సెట్ నుంచి అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది సుత్రీత.
రెండో సెట్‌లో 2-8 తేడాతో లీడ్‌లో ఉన్న సుత్రీత, ఆ తర్వాత ఒత్తిడికి గురై ప్రత్యర్థికి పాయింట్లు అప్పగించింది. అయితే 9-9 తేడాతో సెట్ సమమైన తర్వాత వరుసగా రెండు పాయింట్లు సాధించి 9-11 తేడాతో రెండో సెట్‌ను సొంతం చేసుకుంది సుత్రీత.
హోరాహోరీగా సాగిన మూడో సెట్‌లో 11-11 తేడాతో సమంగా నిలిచినా, వరుసగా రెండు పాయింట్లు సాధించిన బెర్‌స్టోమ్ 11-13 తేడాతో సెట్ గెలిచింది. నాలుగో సెట్‌లో బెర్‌స్టోమ్ గెలిచినా, సుత్రీత వరుసగా మూడు సెట్లు గెలిచి 5-11, 11-9, 11-13, 9-11, 11-3, 11-9, 11-5 (3-4) తేడాతో మ్యాచ్‌ను గెలిచింది.