టోక్యో ఒలింపిక్స్: సెమీస్‌లో ఓడిన పీవీ సింధు... కాంస్య పతక పోరుకి భారత షెట్లర్...

By Chinthakindhi RamuFirst Published Jul 31, 2021, 4:39 PM IST
Highlights

సెమీ ఫైనల్‌లో చైనీస్ ప్లేయర్ తై జూ యంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుస సెట్లలో ఓడిన పీవీ సింధు...

తొలి సెట్‌‌ ఫస్ట్ హాఫ్‌లో 11-8 తేడాతో ఆధిక్యంలో నిలిచినా మ్యాచ్‌ను కోల్పోయిన పీవీ సింధు...

టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆశాకిరణం, తెలుగు తేజం పీవీ సింధు ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. సెమీ ఫైనల్‌లో చైనీస్ ప్లేయర్ తై జూ యంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-18, 21-12 తేడాతో వరుస సెట్లలో ఓడిన పీవీ సింధు, కాంస్య పతకం కోసం జరిగే పోరులో ఆడనుంది. 

తొలి సెట్‌‌ ఫస్ట్ హాఫ్‌లో 11-8 తేడాతో ఆధిక్యంలో నిలిచిన పీవీ సింధు, ఆ తర్వాత తై జూ జోరు ముందు నిలవలేకపోయింది. సెకండ్ హాఫ్‌లో 16-16, 17-17 తేడాతో సమంగా నిలవడంతో ఉత్కంఠ రేగింది. అయితే ఆ తర్వాత వరుస పాయింట్లు సాధించిన తై జూ 21-18 తేడాతో తొలి సెట్‌ను కైవసం చేసుకుంది. 

రెండో సెట్‌లో మొదటి నుంచి దూకుడు చూపించిన తై జూ, పీవీ సింధుపై పూర్తి ఆధిక్యం చూపించింది. స్మాష్ షాట్లతో సింధుకి అవకాశం లేకుండా చేసిన తై జూ, ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. 

టోక్యో ఒలింపిక్స్‌లో శనివారం భారత జట్టుకి పెద్దగా కలిసి రాలేదు. భారత మహిళా హాకీ జట్టు, సౌతాఫ్రికాతో జరిగిన పూల్ మ్యాచ్‌లో విజయం సాధించినా.. భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగల్ తొలి మ్యాచ్‌లోనే ఓటమి చెందాడు.., ఒలింపిక్ మెడల్ తెస్తుందని ఆశపడిన పూజారాణి క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిపోయింది. 

బాక్సింగ్ 69 కేజీల మిడిల్ వెయిట్ విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాకు చెందిన లీ కియాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-5 తేడాతో ఓడింది పూజా రాణి.  

డిస్క్ త్రో ఈవెంట్‌లో గ్రూప్ బీలో కమల్‌ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శన ఇచ్చి ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. తొలి ప్రయత్నంలో 60.29, రెండో ప్రయత్నంలో 63.97, మూడో ప్రయత్నంలో 64.00 విసిరి ఆటోమెటిక్‌ క్వాలిఫికేషన్ సాధించింది.

గ్రూప్ బీలో రెండో స్థానంలో నిలిచిన కమల్‌ప్రీత్ కౌర్, ఫైనల్స్‌కి దూసుకెళ్లగా... సీమా పూనియా క్వాలిఫికేషన్ రౌండ్ నుంచే తప్పుకుంది. మెన్స్ సింగిల్స్ ఆర్చరీ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత ఆర్చర్ అతానుదాస్, జపాన్‌ అథ్లెట్ టకహరు ఫురుకవాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలయ్యాడు. 
 

click me!