
డీఆర్ఎస్ (డిసిజన్ రివ్యూ సిస్టమ్)లో ఉన్న అంపైర్స్ కాల్ అనే విషయాన్ని మార్చాలని సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. 2009లో క్రికెట్‌లో Decision Review System (DRS) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అంపైర్స్ కాల్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. అంపైర్ నిర్ణయంపై టీమ్‌కు అనుమానం ఉంటే, వారు మూడో అంపైర్ దగ్గరకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ టెక్నాలజీ క్లియర్ సాక్ష్యం ఇవ్వలేకపోతే, మైదానంలో ఇచ్చిన అంపైర్ నిర్ణయాన్నే “Umpire’s Call” అనే పేరుతో కొనసాగిస్తారు.
సచిన్ ఇప్పటికే చాలాసార్లు ఈ Umpire’s Call అవసరం లేదని చెప్పాడు. తాజాగా రెడ్డిట్‌లో నిర్వహించిన Ask Me Anything సెషన్‌లో కూడా అదే అభిప్రాయం తెలిపారు. ఈ విషయమై సచిన్ మాట్లాడుతూ.. “నేను DRSలోని Umpire’s Call నియమాన్ని వ్యతిరేకిస్తాను. ఆటగాళ్లు మైదానంలో అంపైర్ నిర్ణయాన్ని నమ్మలేకపోతేనే రివ్యూ కోసం వెళ్తారు. అలాంటప్పుడు మళ్లీ అదే నిర్ణయాన్ని తిరిగి ఎందుకు తీసుకోవాలి? ఆటగాళ్లకు ఎప్పుడో ఫామ్ తగ్గుతుంది. అంపైర్లకూ అలాంటివి జరుగుతాయి. కానీ టెక్నాలజీ, అది ఎంత శాతం తప్పు చూపించినా, ఒకే విధంగా తప్పుగా చూపిస్తుంది. కనుక అది మరింత న్యాయం చేస్తుంది” అని సచిన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
జట్టు ఒక నిర్ణయాన్ని రివ్యూ చేస్తే, LBW వంటి సందర్భాల్లో బంతి వికెట్లను తాకిందా లేదా అనే అంచనాను టెక్నాలజీ ద్వారా చూపిస్తారు. బంతి 1% నుంచి 50% వరకు మాత్రమే వికెట్లను తాకుతున్నట్లుగా చూపిస్తే, మైదాన అంపైర్ ఇచ్చిన అసలు నిర్ణయమే కొనసాగుతుంది. అంటే టెక్నాలజీ చూపించిన ఫలితం మధ్యలో ఉన్నా కూడా, ఆటగాడి రివ్యూ వృథా అవుతుంది.
సచిన్ కెరీర్ విషయానికొస్తే.. 1989 నుంచి 2013 వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడి ప్రపంచాన్ని తన బ్యాటింగ్‌తో మంత్రముగ్ధులను చేశాడు. మొత్తం 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి, 34,357 పరుగులు సాధించాడు. 48.52 యావరేజ్‌తో బ్యాటింగ్‌లో తన సత్తా చాటాడు. 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ఆటగాడిగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అలాగే 164 అర్ధసెంచరీలు కూడా వేశారు. అందుకే ప్రపంచం సచిన్‌ను మాస్టర్ బ్లాస్టర్ అని పిలుస్తుంది.