నేను ఇక్కడే ఉంటా అంటున్న రషీద్

First Published May 28, 2018, 2:03 PM IST
Highlights

ఆఫ్ఘాన్ అధ్యక్షుడికి ట్వీట్ చేసిన రషీద్


రషీద్‌ ఖాన్‌...ఈ పేరు ఇపుడు ఐపిఎల్ క్రికెట్ లో సంచలనం. అతని ప్రతిభకు భారత్ లోని  క్రికెట్ అభిమానులంతా ఫిదా అయిపోయారు. ఎంతలా అంటే.. కొందరు అభిమానులు రషీద్‌కు భారత పౌరసత్వం ఇచ్చి.. టీమిండియాలోకి తీసుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
 
అంతేకాదు మరికొందరైతే ఒక అడుగు ముందకేసి.. రషీద్‌కు భారత పౌరసత్వం ఇప్పించాలని విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు. కావాలంటే రవీంద్ర జడేజాను ఇచ్చేసి రషీద్‌ను టీమిండియాలోకి తీసుకునేలా అఫ్ఘాన్‌ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకోవాలని బీసీసీఐకి సలహా కూడా ఇచ్చారు. దీనిపై సుష్మాతో పాటు, అఫ్ఘాన్ అధ్యక్షుడు కూడా స్పందించిన విషయం తెలిసిందే.
 
తాజాగా దీనిపై రషీద్ ఖాన్ స్పందించాడు. అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అతీఫ్ మషల్ చేసిన ఓ ట్వీట్‌కు అతడు బదులిచ్చాడు. అతీఫ్ మషల్ ‘‘రషీద్‌ ఖాన్ కోసం ఆఫర్ చేస్తున్నవారందికి థ్యాంక్స్. ప్రపంచ వ్యాప్తంగా అతడికెంత డిమాండ్ ఉందో నాకు తెలుసు. కానీ, అతడు ఎక్కడికీ వెళ్లడు. ఎందుకంటే.. అతడు అఫ్ఘాన్ దేశస్థుడిగానే గర్వపడుతున్నాడు’’ అని ట్వీట్ చేశాడు.
 
దీనిపై స్పందించిన రషీద్ ఖాన్ ‘‘ఖచ్చితంగా.. మిస్టర్ చైర్మన్. నేను అఫ్ఘాన్ పౌరుడిగా గర్వపడుతున్నాను. నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను. నా దేశం కోసం పోరాడుతాను. మేము శాంతిని వ్యాప్తి చేయాలనుకుంటున్నాం.. ఎందుకంటే అది మా దేశానికి చాలా అవసరం’’ అంటూ రషీద్ బదులిచ్చాడు.

click me!