టోక్యో ఒలింపిక్స్ : తొలి సెట్ గెలిచి వుంటే ఫలితం ఇంకోలా వుండేది.. సింధూ ఓటమిపై ఆమె తండ్రి స్పందన

By Siva KodatiFirst Published Jul 31, 2021, 5:11 PM IST
Highlights

పీవీ సింధూకి నిన్న ప్లస్ అయిన గేమ్ ఇవాళ మైనస్ అయ్యిందన్నారు ఆమె తండ్రి పీవీ రమణ. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సెమీస్‌లో సింధూ ఓటమిపై ఆయన స్పందించారు. సింధూ అటాకింగ్ గేమ్ ఆడలేకపోయిందని.. సెమీష్‌లో రిథమ్‌లోకి రాలేకపోయిందని రమణ చెప్పారు. 
 

ఒలింపిక్స్  బ్యాడ్మింటన్ సెమీస్‌లో భారత స్టార్ పీవీ సింధూ ఓటమి పాలవ్వడంపై ఆమె తండ్రి పీవీ రమణ స్పందించారు. సింధుకి అటాకింగ్ ఛాన్స్ ఇవ్వకుండా తైజాయింగ్ ఆడిందని ఆయన అన్నారు. సింధు తొలి సెట్ గెలిచి వుంటే ఫలితం మరోలా వుండేదని రమణ పేర్కొన్నారు. సింధూకి నిన్న ప్లస్ అయిన నెట్ గేమ్ ఇవాళ మైనస్ అయ్యిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సింధూ అటాకింగ్ గేమ్ ఆడలేకపోయిందని.. సెమీష్‌లో రిథమ్‌లోకి రాలేకపోయిందని రమణ చెప్పారు. ర్యాలీలు ఎక్కువ ఆడలేకపోవడం కూడా సింధూకి మైనస్ అయ్యిందని ఆయన అభిప్రాయపడ్డారు. 

తైజు వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ అనే విషయం గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. సింధు కోచ్ మీద తమకు ఏ విధమైన అసంతృప్తి లేదని ఆయన చెప్పారు. సింధుకు అవకాశం ఇవ్వకుండా తైజు అటాక్ చేసిందని ఆయన అన్నారు.

కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆశాకిరణం, తెలుగు తేజం పీవీ సింధు ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. సెమీ ఫైనల్‌లో చైనీస్ ప్లేయర్ తై జూ యంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-18, 21-12 తేడాతో వరుస సెట్లలో ఓడిన పీవీ సింధు, కాంస్య పతకం కోసం జరిగే పోరులో ఆడనుంది. 

Also Read:టోక్యో ఒలింపిక్స్: సెమీస్‌లో ఓడిన పీవీ సింధు... కాంస్య పతక పోరుకి భారత షెట్లర్...

తొలి సెట్‌‌ ఫస్ట్ హాఫ్‌లో 11-8 తేడాతో ఆధిక్యంలో నిలిచిన పీవీ సింధు, ఆ తర్వాత తై జూ జోరు ముందు నిలవలేకపోయింది. సెకండ్ హాఫ్‌లో 16-16, 17-17 తేడాతో సమంగా నిలవడంతో ఉత్కంఠ రేగింది. అయితే ఆ తర్వాత వరుస పాయింట్లు సాధించిన తై జూ 21-18 తేడాతో తొలి సెట్‌ను కైవసం చేసుకుంది. రెండో సెట్‌లో మొదటి నుంచి దూకుడు చూపించిన తై జూ, పీవీ సింధుపై పూర్తి ఆధిక్యం చూపించింది. స్మాష్ షాట్లతో సింధుకి అవకాశం లేకుండా చేసిన తై జూ, ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. 

click me!