
బిసిసిఐ తమకు రూ.447 కోట్లు నష్టపరిహారం చేల్లించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేస్తోంది. భారత్-పాకిస్థాన్ ల మద్య జరగాల్సిన ద్వైపాక్షిక సీరిస్ ఒప్పందాన్ని ఉల్లంఘించడంవల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని పిసిబి ఆరోపిస్తోంది. ఈ నష్టానికి కారణమైన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తమకు రూ.447 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఐసిసికి ఫిర్యాదు చేసింది.
భారత్ దేశంలో జరిగిన పలు హింసాత్మక ఘటనలకు పాకిస్థాన్ హస్తం ఉండటంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ప్రభావం క్రికెట్ పై కూడా పడింది. దేశ్ ప్రజల వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని బిసిసిఐ పాకిస్థాన్ తో క్రికెట్ సంబంధాలను కూడా తెంచుకుంది. ఐసిసి నిర్వహించే మ్యాచుల్లో తప్ప సాధారణంగా జరిగే సీరీస్ లలో పాక్ తో క్రికెట్ ఆడేందుకు భారత్ విముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో పిసిబి ఆదాయానికి గండి పడింది.
అయితే గతంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ కోసం రెండు ప్రభుత్వాల మధ్య 2014లో ఒప్పందం కుదిరినట్లు పిసిబి తెలిపింది. ఇందులో భాగంగా 2015 నుంచి 2023 వరకు ఆరుసార్లు రెండు దేశాల మధ్య టోర్నీలు జరపాల్సింది ఒప్పందం కుదిరింది. కానీ ఈ సీరిస్ లో పాల్గొనేందుకు బీసీసీఐ మాత్రం ఒప్పుకోలేదు. దీంతో తాము రూ.447 కోట్లు నష్టపోయినట్లు పిసిబి ఆరోపిస్తోంది. నిబంధనను ఉల్లంఘించి సీరిస్ ను అడ్డుకున్న బిసిసిఐ నుండి నష్టపరిహారం ఇప్పించాలని పిసిబి అంతర్జాతీయ క్రికెట్ మండలిలో కేసు వేసింది.
ఈ కేసుపై ఐసిసి విచారణ ప్రారంభించింది. ఇరు బోర్డులు తమ తమ వాదనలు వినిపించడాని మూడు రోజుల సమయం ఇచ్చింది. అనంతరం ఐసిసి ఈ వ్యవహారంలో తప్పెవరిదో తేల్చనుంది.