Neeraj Chopra:గాయమైనా బాగా విసిరాడు.. పాక్ ఆటగాడిపై నీరజ్ చోప్రా ప్రశంసలు

Published : Jul 25, 2022, 11:35 AM IST
Neeraj Chopra:గాయమైనా బాగా విసిరాడు.. పాక్ ఆటగాడిపై నీరజ్ చోప్రా ప్రశంసలు

సారాంశం

World Athletics Championships 2022: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్-2022లో భాగంగా యూజీన్‌లో ముగిసిన జావెలిన్ త్రో ఫైనల్స్ లో రజతం సాధించిన నీరజ్ చోప్రా పాకిస్తాన్ ఆటగాడిపై ప్రశంసలు కురిపించాడు.

అమెరికాలోని యూజీన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్-2022 లో  ఆదివారం ముగిసిన ఫైనల్స్ లో 88.13 మీటర్ల దూరం బరిసెను విసిరి రజత పతకం సాధించి చరిత్ర సృష్టించాడు భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా. అయితే ఇదే పోటీలలో పాల్గొన్న పాకిస్తాన్ ఆటగాడు అర్షద్ నదీమ్.. ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అయితే  భుజానికి గాయమైనా అద్భుతంగా విసిరాడని నీరజ్ కొనియాడాడు. 

ఫైనల్స్ ముగిసిన అనంతరం నీరజ్ మాట్లాడుతూ..‘ఫైనల్స్ ముగిశాక నేను అర్షద్ నదీమ్ తో మాట్లాడాను. అతడు బాగా త్రో చేశాడని నేను అతడితో చెప్పాను. అయితే అతడు తన భుజానికి గాయమైందని, అయినా బల్లెన్ని విసిరినట్టు నాతో చెప్పాడు.. 

అది విన్న తర్వాత నేను అతడిని ప్రశంసించుకుండా ఉండలేకపోయాను. గాయమయ్యాక కూడా అతడు జావెలిన్ ను బాగా విసిరాడు. అది మెచ్చుకోదగిన ఆట..’ అని నీరజ్ తెలిపాడు. 

 

ఆదివారం ముగిసిన ఈవెంట్ లో  గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 90.54 మీటర్ల దూరం త్రో చేసి స్వర్ణాన్ని నెగ్గిన విషయం తెలిసిందే.  ఇక నీరజ్ చోప్రా.. 88.13 మీటర్లతో రజతాన్ని గెలవగా.. చెక్ రిపబ్లిక్ కు చెందిన  జాకుబ్ వాద్‌లెచ్ 88.09 మీటర్లతో కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ పోటీలలో అర్షద్ నదీమ్.. 86 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 

కాగా 2018 ఆసియా క్రీడలలో భాగంగా పోడియంపై నీరజ్ చోప్రా,    అర్షద్ నదీమ్  ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్న ఫోటో అప్పట్లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి ఏ టోర్నీలో పాల్గొన్నా ఈ ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. 

 

ఇక ఆదివారం నాటి పోటీలలో తొలి ప్రయత్నంలో విఫలమైన (ఫౌల్ చేశాడు) చోప్రా..  రెండో ప్రయత్నంలో 82.39 మీటర్లు... మూడో ప్రయత్నంలో 86.37 మీటర్లు విసిరాడు. తద్వారా నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇక నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం విసిరాడు. అయితే నాలుగో ప్రయత్నం తర్వాత తన తొడలో నొప్పి ఉండటంతో మిగిలిన రెండు త్రోలు సరిగా విసరలేకపోయానని చోప్రా చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు తాను బాగానే ఉన్నానని  పాత్రికేయుల సమావేశంలో తెలిపాడు.

PREV
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !