జాతీయ క్రీడా పురస్క‌రాలు ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం.. ఈసారి ఊహించ‌ని ట్విస్ట్

Published : Aug 18, 2026, 04:45 PM IST
National Sports Awards

సారాంశం

National Sports Awards: భారత క్రీడారంగంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు, కోచ్‌లను సత్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా పురస్కారాలు-2025ని ప్ర‌క‌టించింది. అయితే ఈసారి ఒక కీల‌క పరిణామం చోటు చేసుకుంది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.?

ఈసారి ఖేల్‌రత్న ఎవ‌రికీ ఇవ్వ‌లేదు

ప్రతి ఏడాది దేశంలో అత్యుత్తమ క్రీడా ప్రతిభకు అందించే ఖేల్‌రత్న పురస్కారం ఈసారి ఎవరి పేరుతోనూ ప్రకటించకపోవడం ప్రత్యేకంగా నిలిచింది. ఎంపిక ప్రక్రియలో హాకీ ఆటగాడు హార్దిక్ సింగ్ పేరును పరిశీలించినట్లు సమాచారం. అయితే చివరకు ఆయన పేరు తుది జాబితాలోకి రాలేదు. ఖేల్‌రత్న అందకపోయినా, ఈసారి అర్జున అవార్డుల జాబితాలో యువ క్రీడాకారులతో పాటు అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన అనుభవజ్ఞులకు ప్రాధాన్యం లభించింది. గత కొన్నేళ్లలో అంతర్జాతీయ పోటీల్లో నిలకడగా రాణించిన ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకుని ఎంపిక ప్రక్రియ సాగినట్లు క్రీడా శాఖ వెల్లడించింది.

17 మంది అర్జున అవార్డు విజేతలు వీరే

ఈ ఏడాది అర్జున అవార్డుకు ఎంపికైన 17 మంది క్రీడాకారులు వివిధ విభాగాలకు చెందినవారు. అథ్లెటిక్స్ నుంచి తేజస్విన్ శంకర్, మహమ్మద్ అజ్మల్ వి, ప్రియాంక గోస్వామికి ఈ గౌరవం దక్కింది. బ్యాడ్మింటన్‌లో మహిళల డబుల్స్ జోడీ ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రీ గోపీచంద్ అవార్డుకు ఎంపికయ్యారు. చెస్‌లో గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతీతో పాటు యువ చెస్ సంచలనం దివ్య జితేంద్ర దేశ్‌ముఖ్ చోటు దక్కించుకున్నారు.

బాక్సింగ్ నుంచి నరేందర్, హాకీ నుంచి లాల్‌రెమ్సియామి, రాజ్‌కుమార్ పాల్, కబడ్డీ నుంచి సుర్జీత్, పూజా ఎంపికయ్యారు. రోయింగ్‌లో అరవింద్ సింగ్, షూటింగ్‌లో అఖిల్ షెరాన్ అవార్డు అందుకోనున్నారు. పారా స్పోర్ట్స్ విభాగంలో రుద్రాంశ్ ఖండేల్వాల్, ఏక్తా భయాన్‌లకు గుర్తింపు లభించింది. బధిరుల షూటింగ్‌లో ధనుష్ శ్రీకాంత్‌కు అర్జున పురస్కారం ప్రకటించారు.

అర్జున అవార్డు 2025 విజేతలు వేళ్లే..

తేజస్విన్ శంకర్ – అథ్లెటిక్స్

మహమ్మద్ అజ్మల్ వి – అథ్లెటిక్స్

ప్రియాంక గోస్వామి – అథ్లెటిక్స్

ట్రీసా జాలీ – బ్యాడ్మింటన్

పుల్లెల గాయత్రీ గోపీచంద్ – బ్యాడ్మింటన్

నరేందర్ – బాక్సింగ్

విదిత్ సంతోష్ గుజరాతీ – చెస్

దివ్య జితేంద్ర దేశ్‌ముఖ్ – చెస్

ధనుష్ శ్రీకాంత్ – డెఫ్ షూటింగ్

లాల్‌రెమ్సియామి – హాకీ

రాజ్‌కుమార్ పాల్ – హాకీ

సుర్జీత్ – కబడ్డీ

పూజా – కబడ్డీ

రుద్రాంశ్ ఖండేల్వాల్ – పారా షూటింగ్

ఏక్తా భయాన్ – పారా అథ్లెటిక్స్

అరవింద్ సింగ్ – రోయింగ్

అఖిల్ షెరాన్ – షూటింగ్

చెస్, బ్యాడ్మింటన్ నుంచి ప్రత్యేక ఆకర్షణ

2025 అర్జున అవార్డుల జాబితాలో చెస్, బ్యాడ్మింటన్ క్రీడాకారులు ప్రత్యేకంగా నిలిచారు. చెస్‌లో దివ్య దేశ్‌ముఖ్‌కు దక్కిన గుర్తింపు ఆమె ఇటీవలి విజయాలకు కొనసాగింపుగా చెప్పవచ్చు. యువ క్రీడాకారిణిగా అంతర్జాతీయ ప్లాట్ ఫామ్ పై తన ప్రతిభను చాటుకున్న ఆమె భారత చెస్ భవిష్యత్ తారల్లో ఒకరిగా గుర్తింపు పొందుతున్నారు. మరోవైపు బ్యాడ్మింటన్‌లో ట్రీసా జాలీ, గాయత్రీ గోపీచంద్ జోడీకి అర్జున అవార్డు రావడం విశేషం. మహిళల డబుల్స్‌లో అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన చేస్తూ భారత బ్యాడ్మింటన్‌కు ప్రాధాన్యం తీసుకొచ్చిన ఈ జోడీకి ఈ పురస్కారం మరింత ప్రోత్సాహాన్ని అందించనుంది. అథ్లెటిక్స్ విభాగంలో తేజస్విన్ శంకర్ ఎంపిక కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. డెకాథ్లాన్‌తో పాటు అథ్లెటిక్స్‌లో వివిధ పోటీల్లో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న ఆయనకు లభించిన ఈ గౌరవం క్రీడాభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

అరుమై నాయగంకు లైఫ్‌టైమ్ అర్జున.. ఐదుగురు కోచ్‌లకు ద్రోణాచార్య

అర్జున అవార్డుల సాధారణ విభాగంతో పాటు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ కేటగిరీలోనూ కేంద్రం ఓ సీనియర్ క్రీడాకారుడిని గుర్తించింది. 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత ఫుట్‌బాల్ జట్టు సభ్యుడు ఐ. అరుమై నాయగంకు లైఫ్‌టైమ్ అర్జున అవార్డు ప్రకటించారు. భారత ఫుట్‌బాల్‌కు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. కోచ్‌లకు అందించే ద్రోణాచార్య అవార్డుల్లో రెగ్యులర్ విభాగానికి ముగ్గురు ఎంపికయ్యారు. ఛోటే లాల్ యాదవ్ – బాక్సింగ్, పర్వీర్ సింగ్ – అథ్లెటిక్స్, నేహా నందకుమార్ చవాన్ – షూటింగ్ విభాగాల్లో ఈ గౌరవాన్ని అందుకోనున్నారు. లైఫ్‌టైమ్ కేటగిరీలో ధర్మేంద్ర సింగ్ యాదవ్ – బాక్సింగ్, వీరేందర్ కుమార్ – రెజ్లింగ్ అవార్డుకు ఎంపికయ్యారు.

ఇదే సమయంలో క్రీడల అభివృద్ధి, ప్రోత్సాహానికి చేసిన కృషిని గుర్తిస్తూ పూణేలోని ఆర్మీ పారాలింపిక్ నోడ్‌కు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం దక్కింది. మొత్తంగా చూస్తే, 2025 జాతీయ క్రీడా పురస్కారాల్లో ఖేల్‌రత్న లేకపోవడం ప్రత్యేక చర్చకు దారితీసినా.. అర్జున అవార్డుల ద్వారా భారత క్రీడారంగంలోని విభిన్న విభాగాలకు చెందిన ప్రతిభావంతులకు కేంద్రం గుర్తింపు ఇచ్చింది. యువ క్రీడాకారులతో పాటు సీనియర్ క్రీడాకారులు, కోచ్‌ల సేవలను ఒకేసారి గౌరవించడం ఈ ఏడాది పురస్కారాల ప్రత్యేకతగా నిలిచింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ayush Shetty: బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సంచలనం.. ప్రపంచ నంబర్ 1 కు షాకిచ్చిన భారత ప్లేయర్
Tallest Cricketers : అత్యంత పొడగరి ఇండియన్ క్రికెటర్ ఇతడే... హైట్ ఎంతో తెలుసా?