ధోనీ రిటైర్‌ కాబోతున్నాడా..? అంపైర్ల నుంచి బాల్ ఎందుకు తీసుకున్నాడు..? అర్థం అదేనా..?

First Published Jul 18, 2018, 12:09 PM IST
Highlights

నిన్న మ్యాచ్ ముగిసిన తర్వాత అంపైర్ల నుంచి బాల్ తీసుకుని దానిని చూసుకుంటూ.. ముభావంగా పెవిలియన్ బాట పట్టాడు. ఆ సన్నివేశం చూసిన భారత అభిమానులు తీవ్రంగా బాధపడుతున్నారు

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఇంగ్లాండ్ చేతిలో దారుణ పరాజయాన్ని మూటకట్టుకోవడంతో పాటు.. సిరీస్‌ను కోల్పోయింది. తొమ్మిది వరుస సిరీస్‌ల తర్వాత భారత్‌కు ఇదే తొలి సిరీస్ ఓటమి. విరాట్ కోహ్లీ కెప్టెన్ అయిన తర్వాత తొలి సిరీస్ ఓటమి. ఇది బాధపడాల్సిన విషయమే అయినా దీనికంటే ఎక్కువగా టీమిండియా అభిమానులు ఒక విషయం గురించి ఆందోళనకు గురవుతున్నారు.

నిన్న మ్యాచ్ ముగిసిన తర్వాత అంపైర్ల నుంచి బాల్ తీసుకుని దానిని చూసుకుంటూ.. ముభావంగా పెవిలియన్ బాట పట్టాడు. ఆ సన్నివేశం చూసిన భారత అభిమానులు తీవ్రంగా బాధపడుతున్నారు. ఎవరైనా గెలిచిన మ్యాచ్‌లో గుర్తుగా ఇలా తీసుకుంటారు కానీ ధోనీ ఓడిన మ్యాచ్‌లో బాల్‌ను అడిగి తీసుకోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో టెస్టులకు వీడ్కోలు పలికే సమయంలో కూడా వికెట్ బెల్స్‌ను తీసుకెళ్లాడు.. తాజాగా అంపైర్ల నుంచి బంతిని తీసుకోవడం అభిమానుల్లో పెద్ద చర్చకు కారణమైంది.

దీనిపై ట్విట్టర్‌లో తెగ ట్రోల్ చేస్తున్నారు.. ‘‘ బహుశా ధోని రిటైర్ అవ్వబోతున్నాడా..? అని  కొందరు..? ‘‘ ధోని వన్డే కెరీర్‌లో ఇంగ్లాండ్‌ గడ్డపై ఇదే చివరి మ్యాచా ’’ అని మరికొందరు.. అస్సలు  ‘‘ధోని ఎంపైర్ల నుంచి బాల్ ఎందుకు తీసుకున్నాడన్నది పెద్ద ప్రశ్నగా ’’ మారిందనంటూ కామెంట్ చేస్తున్నారు. ‘‘ ప్లీజ్ ధోని ఇలాంటి పని మరోసారి చేయొద్దని’’.. ‘‘ ధోని రిటైరవ్వడానికి ఇది సరైన సమయం కాదు.. దయచేసి రిటైర్‌మెంట్ ప్రకటించొద్దని... ‘‘ఆసియా కప్‌ ధోనీ చివరి వన్డే టోర్నమెంట్ అని.. ఇలా ఎవరికి తోచినట్లు వారు స్పందించారు.

ధోని 2014లో టెస్టుల నుంచి తప్పుకున్నాడు.. 321 వన్డేలు, 93 టీ20లు ఆడాడు.. 321 వన్డేల్లో 51.25 సగటుతో 10,046 పరుగులు చేశాడు.. ఇందులో 67 అర్థ సెంచరీలున్నాయి.. అలాగే 93 టీ20లలో 37.17 సగటుతో 1487 పరుగులు చేశాడు. తాజాగా వన్డేల్లో 10,000 పరుగులు పూర్తి చేసిన 12వ భారత ఆటగాడిగా ధోనీ రికార్డుల్లోకి ఎక్కాడు.. అలాగే వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా 10,000 పరుగులు పూర్తి చేసి కుమార సంగక్కర సరసన నిలిచాడు. జట్టుకు వన్డే, టీ20, ఛాంపియన్స్ ట్రోఫిలను అందించిన ఏకైక కెప్టెన్.

click me!