గంగూలీ చొక్కా విప్పిన రోజు.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ‘టీమిండియా జాంటీ రోడ్స్ ’

First Published Jul 13, 2018, 6:56 PM IST
Highlights

2002 జూలై 13 సరిగ్గా ఇదే రోజున.. చారిత్రక లార్డ్స్ గ్రౌండ్‌లో నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్‌... ప్రత్యర్థి మన ముందు నిర్ధేశించిన 326 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన టీమిండియా 146 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలుచుంది

2002 జూలై 13 సరిగ్గా ఇదే రోజున.. చారిత్రక లార్డ్స్ గ్రౌండ్‌లో నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్‌... ప్రత్యర్థి మన ముందు నిర్ధేశించిన 326 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన టీమిండియా 146 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలుచుంది. కానీ ఆ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్-మహ్మాద్ కైఫ్ జోడీ అద్భుతంగా ఆడి భారత్‌ను గెలిపించారు. విన్నింగ్ షాట్ కొట్టిన వెంటనే నాటి భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ షర్ట్ విప్పి గాల్లోకి తిప్పిన సన్నివేశాన్ని భారత అభిమానులు మరచిపోలేరు..

ఆ చిరస్మరణీయ విజయంలో కీలకపాత్ర పోషించిన మహమ్మద్ కైఫ్.. అదే శుభదినం రోజున తాను  క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు.. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటిస్తూ.. టీమిండియా జెర్సీ ధరించడం గౌరవంగా భావిస్తున్నానని.. క్లిష్ట సమయాల్లో నాకు మద్ధతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ.. బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, కార్యదర్శి అమితాబ్ చౌదరీలకు మెయిల్ చేశాడు.

కైఫ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది అతని ఫీల్డింగ్..  పాయింట్స్‌లో చురుగ్గా కదులుతూ ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు, రనౌట్‌లు చేసి టీమిండియా విజయంలో కీలకపాత్ర  పోషించాడు కైఫ్.. 2000వ సంవత్సరంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కైఫ్.. 13 టెస్టుల్లో 624 పరుగులు, 125 వన్డేల్లో 2753 పరుగులు చేశాడు.. 2003లో టీమిండియా ఫైనల్ చేరడంలో  కైఫ్ కీలకపాత్ర పోషించాడు.

click me!