Kho Kho World Cup 2025: ప్రియాంక ఇంగ్లే నాయకత్వంలోని భారత మహిళా జట్టు సోమవారం జరిగే ఖో ఖో ప్రపంచ కప్‌లో తమ తొలి మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో తలపడనుంది.
Kho Kho World Cup 2025 Exclusive: ఖో ఖో ప్రపంచ కప్ 2025కు రంగం సిద్ధమైంది. జనవరి 13న గ్రాండ్ గా ప్రారంభం కానుండటంతో ఉత్సాహం నెలకొంది. గురువారం, ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (KKFI) ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగే ఈ చారిత్రాత్మక ఈవెంట్‌కు పురుషులు, మహిళల జట్లను ప్రకటించింది.
KKFI చీఫ్ సుధాంశు మిట్టల్ జట్ల కెప్టెన్లను ప్రకటించారు. ప్రతీక్ వైకర్ పురుషుల జట్టుకు నాయకత్వం వహిస్తారు. ప్రియాంక ఇంగ్లే మహిళల జట్టుకు ముందుకు నడిపించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రియాంక ఇంగ్లే ప్రదర్శనలు, అనుభవం భారత్ ను ఛాంపియన్ గా నిలబెడుతాయని భావిస్తున్నారు.
ఖోఖో వరల్డ్ కప్ 2025 లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి?
కెప్టెన్‌గా తన నియామకం గురించి మాట్లాడుతూ ప్రియాంక ఇంగ్లే ఆనందం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచినందుకు సమాఖ్య, జట్టు నిర్వహణకు ప్రియాంక కృతజ్ఞతలు తెలిపారు, తన ఆనందాన్ని మాటల్లో వ్యక్తపరచడం కష్టమని అన్నారు.
“ప్రతి ఒక్కరూ నాపై చాలా నమ్మకం చూపించడం చాలా ఆనందంగా ఉంది. భారత జట్టు కెప్టెన్‌గా నియమితులైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జట్టుకు నాయకత్వం వహించే బాధ్యత నాకు అప్పగించిన తర్వాత నేను ఎలా ఫీలవుతున్నానో మాటల్లో వర్ణించడం కష్టం” అని ప్రియాంక ఇంగ్లే ఆసియా నెట్ న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.
మహారాష్ట్రకు చెందిన ప్రింయా ఇంగ్లే.. దేశీయ క్రీడలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం, కెప్టెన్‌గా వ్యవహరించడం పట్ల ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు జట్టు సన్నాహాలు, వ్యూహాల గురించి 23 ఏళ్ల ప్రియాంక ఇంగ్లే మాట్లాడారు.
“ఖో ఖో ఆట మొదట మహారాష్ట్రలో ఆడారు.. నేను మహారాష్ట్ర తరపున ఆడుతున్నాను. 4వ ఆసియా ఖో ఖో ఛాంపియన్‌షిప్‌లో ఒక ఆటగాడిగా భారత్‌కు ప్రాతినిధ్యం వహించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు, ఖో ఖో ప్రపంచ కప్‌లో జాతీయ జట్టుకు నాయకత్వం వహిస్తాను” అని భారత మహిళా కెప్టెన్ అన్నారు.
“టోర్నమెంట్‌కు ముందు సన్నాహకంగా గత నెల రోజులుగా శిబిరం కొనసాగుతోంది. కోచ్‌లు మమ్మల్ని ఖో ఖో ప్రపంచ కప్‌కు సిద్ధం చేశారు. మేము కఠినమైన శిక్షణ, ఆహారంలో మార్పులు, గాయాల నివారణను అనుసరిస్తున్నాము. శిబిరంలో మానసికంగా మమ్మల్ని బలపరిచే ఉపన్యాస సెషన్ లు కూడా నిర్వహించారు. గత నెల రోజులుగా రెండు ప్రాక్టీస్ సెషన్‌లు జరుగుతున్నాయి. టోర్నమెంట్ కోసం మా వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నాము. భారత జట్టుకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను" అని ఆమె అన్నారు.
ప్రియాంక ఇంగ్లే 2016 నుండి భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2016 ఆసియా ఖో ఖో ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన జట్టులో భాగంగా ఉన్నారు. ఇంగ్లే 5 సంవత్సరాల వయస్సు నుండి ఈ క్రీడను ఆడుతున్నారు. సబ్-జూనియర్ నేషనల్స్‌లో ఆమె ప్రదర్శనకు 'ఇలా' అవార్డు, 2022లో సీనియర్ నేషనల్స్‌లో ఆమె అద్భుతమైన ప్రదర్శనకు రాణి లక్ష్మీబాయి అవార్డును అందుకున్నారు.
ప్రియాంక ఇంగ్లే నాయకత్వంలోని భారత జట్టు సోమవారం టోర్నమెంట్ ప్రారంభంలో దక్షిణ కొరియాతో తమ తొలి మ్యాచ్ ఆడుతుంది.