
Indian Womens Hockey Team: 2025 మహిళా హాకీ ఆసియా కప్ ఆడటానికి భారత జట్టు చైనాలోని హాంగ్‌జౌకి చేరుకుంది. శనివారం చైనాకు బయలుదేరిన భారత జట్టు.. 2026 మహిళా హాకీ ప్రపంచ కప్‌కు అర్హత సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆసియా కప్‌లో మంచి ప్రదర్శన చేస్తే ప్రపంచ కప్‌కు అర్హత లభిస్తుంది.
కెప్టెన్ సలిమా టెటే నేతృత్వంలోని 20 మంది సభ్యుల భారత జట్టు చైనాకు వెళ్ళింది. ఆదివారం హాంగ్‌జౌ చేరుకున్న జట్టుకు భారత కాన్సుల్ జనరల్ ప్రతీక్ మాథుర్ స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మడీ మాటలను గుర్తు చేస్తూ.. 'క్రీడలు వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తాయి, జట్టుకృషిని ప్రోత్సహిస్తాయి, యువతరాన్ని పెద్ద కలలు కనడానికి ప్రేరేపిస్తాయి' అని ఆయన అన్నారు.
హాంగ్‌జౌలో భారత మహిళా హాకీ జట్టుకు స్థానిక అధికారులు, విద్యావేత్తలు, భారతీయులు స్వాగతం పలికారు. ప్రధాని మోడీ కూడా చైనాలో ఉన్న సమయంలోనే భారత మహిళా హాకీ జట్టు అక్కడికి వెళ్లడంతో ఆసక్తికర పరిణామంగా ఉంది.
హాంగ్‌జౌలో జరిగిన కార్యక్రమంలో చైనీస్ భాషలోకి అనువదించిన భగవద్గీతను ఆవిష్కరించారు. ఝెజియాంగ్ విశ్వవిద్యాలయంలోని వేదాంత అధ్యయన పాఠశాల అధిపతి వాంగ్ ఝిచెంగ్ దీన్ని అనువదించారు. ఆయనకు ప్రధాని మోడీ వ్యక్తిగతంగా లేఖ రాసి అభినందించారు. ఏడేళ్ల తర్వాత చైనా పర్యటనకు వెళ్ళిన ప్రధాని మోడీ టూర్ తో భారత్-చైనా దౌత్య సంబంధాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నారు. రెండు దేశాలు ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నాయి.
భారతదేశం పూల్ బీలో ఉంది, గ్రూప్ దశలో జపాన్, థాయిలాండ్, సింగపూర్‌లను ఎదుర్కోనుంది. సెప్టెంబర్ 5న థాయిలాండ్‌తో తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది, ఆ తర్వాత సెప్టెంబర్ 6న జపాన్‌తో తలపడనుంది. చివరగా, సెప్టెంబర్ 8న సింగపూర్‌తో తమ చివరి పూల్-స్టేజ్ మ్యాచ్ ఆడనుంది.
భారత మహిళల ఆసియా కప్‌ను రెండుసార్లు గెలుచుకుంది, మొదటిసారి 2004లో, రెండవసారి 2017లో. ఈ టోర్నమెంట్ గత ఎడిషన్‌లో భారత్ మూడో స్థానంలో నిలిచింది.