ఇంగ్లాండుకు భారత్ సవాల్: ఇక బౌలర్ల వంతు

By pratap reddyFirst Published Aug 21, 2018, 7:33 AM IST
Highlights

ఇంగ్లాండు తన రెండో ఇన్నింగ్సును ప్రారంభించి వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది.  క్రీజులో కుక్‌ (9 బ్యాటింగ్‌), జెన్నింగ్స్‌ (13 బ్యాటింగ్‌) ఉన్నారు. విజయానికి ఇంగ్లాండు ఇంకా  498 పరుగులు చేయాల్సి ఉంటుంది.

నాటింగ్ హామ్: తొలి రెండు టెస్టు మ్యాచుల్లో ఘోరంగా విఫలమైన భారత్ మూడో టెస్టు మ్యాచులో ఇంగ్లాండు ముందు భారీ టార్గెట్ పెట్టి సవాల్ విసిరింది. రెండో ఇన్నింగ్సులో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం ద్వారా తన సత్తా మరోసారి చాటుకున్నాడు. అతను 197 బంతుల్లో 10 ఫోర్లతో 103 పరుగులు చేశాడు. భారత్ రెండో ఇన్నింగ్సును ఏడు వికెట్ల నష్టానికి 352 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

తద్వారా భారత జట్టుకు 520 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. ఇంగ్లాండు తన రెండో ఇన్నింగ్సును ప్రారంభించి వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది.  క్రీజులో కుక్‌ (9 బ్యాటింగ్‌), జెన్నింగ్స్‌ (13 బ్యాటింగ్‌) ఉన్నారు. విజయానికి ఇంగ్లాండు ఇంకా  498 పరుగులు చేయాల్సి ఉంటుంది.

ఇంగ్లాండుతో మూడో టెస్టు: మరో ఘనత సాధించిన కోహ్లీ

భారత్ రెండో ఇన్నింగ్సులో పుజారా (208 బంతుల్లో 9 ఫోర్లతో 72), పాండ్యా (52 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 52 నాటౌట్‌) అర్ధ సెంచరీలు చేశారు. ఇంగ్లాండు బౌలర్ రషీద్‌కు మూడు వికెట్లు దక్కాయి. 

124/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు సోమవారం ఆటను ప్రారంభించిన భారత జట్టు నిలకడగా ఆడింది. కోహ్లీ, పుజారా నిదానంగా బ్యాటింగ్‌ చేయడంతో తొలి సెషన్‌లో భారత్‌ 70 పరుగులు మాత్రమే చేసింది.  

పుజారా 147 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 16 ఇన్నింగ్స్‌ల తర్వాత అతడికిదే తొలి హాఫ్‌ సెంచరీ. ఆ వెంటనే కోహ్లీ 82 బంతుల్లో వరుసగా రెండో అర్ధ సెంచరీ సాధించాడు. దీంతోపాటు సిరీస్ లో రెండోసారి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా సెషన్‌ను ముగించింది.
 
రెండో సెషన్ లో ఇంగ్లండ్‌ బౌలర్లు ఒక్క వికెట్‌ మాత్రమే తీయగలిగారు. కోహ్లీ, పుజారా సహనంతో ఆడతూ వికెట్లను కాపాడుకుంటూ పరుగులు చేశారు. దీంతో 63వ ఓవర్‌లో జట్టు స్కోరు 200 దాటింది. పుజారాను స్టోక్స్‌ బౌలింగులో 72వ ఓవర్‌లో స్లిప్‌లో కుక్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో మూడో వికెట్‌ భాగస్వామ్యం 113 పరుగుల వద్ద ముగిసింది. ఆ తర్వాత రహానె, కోహ్లీ కలిసి మరో వికెట్‌ పడకుండా టీ బ్రేక్‌కు వెళ్లారు. అప్పటికి జట్టు ఆధిక్యం 438కి చేరింది.
 
టీ బ్రేక్‌ తర్వాత ఆరంభంలోనే కోహ్లీ 191 బంతుల్లో సిరీస్ లో రెండో సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ పూర్తి చేసిన తర్వాత కొద్ది సేపటికే కోహ్లీని వోక్స్‌ ఎల్బీగా అవుట్‌ చేశాడు. ఆ తర్వాత పంత్‌ (1)ను ఆండర్సన్‌ పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో పాండ్యా, రహానె (29) బౌలర్లను విసిగించారు. అయితే స్పిన్నర్‌ రషీద్‌ 2 వికెట్లను తీశాడు. 

హార్దిక్ పాండ్యా ఓ సిక్సర్‌తో జట్టు ఆధిక్యాన్ని 500 పరుగులు దాటించాడు.  110వ ఓవర్‌లో షమి (3) రషీద్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడి క్యాచ్‌ అవుటయ్యాడు. మరో మూడు బంతుల్లో ఆ ఓవర్‌ ముగియగానే కోహ్లీ డిక్లేర్‌ను ప్రకటించాడు. 

click me!