
న్యూఢిల్లీ: వెస్టిండీస్ తో జరిగే రెండు టెస్టు మ్యాచుల సిరీస్ కు రోహిత్ శర్మను ఎంపిక చేయడంపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్ తో జరిగే సిరీస్ కు విరాట్ కోహ్లీ నేతృత్వంలోని 15 మందితో కూడిన భారత జట్టును బిసిసిఐ సెలెక్షన్ కమిటీ శనివారం ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడంపై గంగూలీ ట్విట్టర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆసియా కప్ లో రోహిత్ శర్మ ప్రదర్శన విశిష్టమైందని ఆయన కొనియాడాడు. ఆశ్చర్యం వేసింది, టెస్టు జట్టులో ప్రతిసారీ నీ పేరు చూడలేకపోతున్నా అని గంగూలీ రోహిత్ శర్మను ఉద్దేశించి ట్వీట్ చేశాడు.
ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో రోహిత్ శర్మ చివరిసారి ఆడాడు. ఆ తర్వాత అఫ్గానిస్తాన్, ఇంగ్లాండులతో జరిగిన టెస్టు మ్యాచులకు ఆయనను పక్కన పెట్టేశారు. అఫ్గానిస్తాన్ తో జరిగిన టెస్టు మ్యాచులో భారత్ విజయం సాధించగా, ఇంగ్లాండుతో జరిగిన సిరీస్ లో ఓటమి పాలైంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టుల్లో రోహిత్ శర్మ 10, 11, 10, 47 పరుగులు చేశాడు. దీంతో అతని ప్రదర్శన టెస్టు మ్యాచుల్లో బాగాలేదనే ఉద్దేశంతో ఆ తర్వాతి సిరీస్ లకు పక్కన పెట్టేశారు.