వెస్టిండీస్ తో టెస్టు సిరీస్: రోహిత్ కు మళ్లీ చేయి, ధావన్ ఔట్

By pratap reddyFirst Published Sep 30, 2018, 8:42 AM IST
Highlights

విరాట్‌ కోహ్లీ నేతృత్వంలో 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును శనివారం సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. వచ్చే నెల 4 నుంచి 9 వరకు రాజ్‌కోట్‌లో తొలి టెస్టు, 12 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో రెండో టెస్టు జరుగుతుంది. 

న్యూఢిల్లీ: వెస్టిండీస్ తో జరిగే రెండు మ్యాచుల టెస్టు సిరీస్ కు బిసిసిఐ సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. మరోసారి రోహిత్ శర్మకు చేయి ఇచ్చింది. ఇంగ్లాండుతో జరిగిన సిరీస్ లో పేలవమైన ప్రదర్శన చేసిన శిఖర్ ధావన్ ను పక్కన పెట్టింది.

విరాట్‌ కోహ్లీ నేతృత్వంలో 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును శనివారం సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. వచ్చే నెల 4 నుంచి 9 వరకు రాజ్‌కోట్‌లో తొలి టెస్టు, 12 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో రెండో టెస్టు జరుగుతుంది. 

హైదరాబాదీ సిరాజ్‌తో పాటు మయాంక్‌ అగర్వాల్‌కు కూడా తొలిసారిగా బెర్త్‌ దక్కింది. ఆంధ్ర క్రికెటర్‌ హనుమ విహారి తిరిగి స్థానం కల్పించారు. పేస్‌ ద్వయం భువనేశ్వర్‌ కుమార్‌, బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చారు. దినేష్ కార్తిక్ పై కూడా వేటు పడింది. 

ధావన్ ను తప్పించడంతో కేఎల్‌ రాహుల్‌తో కలిసి పృథ్వీ షా ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. గాయాల కారణంగా ఇషాంత్‌, పాండ్యాల పేర్లను పరిగణలోకి తీసుకోలేదని, పని ఒత్తిడి కారణంగా భువీ, బుమ్రాలకు విశ్రాంతి కల్పించామని బీసీసీఐ కార్యదర్శి అమితాబ్‌ చౌదరి తెలిపారు.

ఇంగ్లాండుతో చివరి రెండు టెస్టులకు డ్రాప్ చేసిన మురళీ విజయ్ ను ఈ జట్టుకు ఎంపిక చేయలేదు. కరుణ్ నాయర్ ను కూడా పక్కన పెట్టేశారు. దినేష్ కార్తిక్ లేకపోవడంతో రిషబ్ పంత్ ఒక్కడే వికెట్ కీపర్ గా జట్టులో ఉన్నాడు.

జట్టు: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), అజింక్యా రహానే (వైఎస్ కెప్టెన్), కేఎల్‌ రాహుల్‌, పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌, పుజారా, హనుమ విహారి, రిషభ్‌ పంత్‌, అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, షమి, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌.

click me!