20 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై.. టీమిండియాకు 'నయా వాల్' దూరం..

Published : Aug 24, 2025, 12:51 PM IST
Cheteshwar Pujara

సారాంశం

Cheteshwar Pujara: భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్ అయ్యారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 2010లో అడుగు పెట్టిన ‘నయా వాల్’ పుజారా జట్టు నుంచి తప్పుకున్నారు.

Cheteshwar Pujara: భారత క్రికెట్‌ జట్టు మాజీ ఆటగాడు చతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) తన ఆట జీవితానికి ముగింపు పలికాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించాడు. దీంతో ఆయన 20 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. 2005లో సౌరాష్ట్ర తరఫున విదర్భపై జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో తన ప్రస్థానాన్ని ఆరంభించిన పుజారా, చివరిసారిగా 2025 ఫిబ్రవరిలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు.

2010లో బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా పుజారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. 2013లో జింబాబ్వేపై వన్డే అరంగేట్రం చేశాడు. అయితే ఆయన వన్డే కెరీర్ ఎక్కువ కాలం నిలవలేదు. కానీ టెస్ట్ క్రికెట్‌లో మాత్రం దశాబ్దానికి పైగా భారత్ తరఫున కీలక ఆటగాడిగా రాణించాడు. పుజారా మొత్తం 103 టెస్టులు ఆడి, 43.60 సగటుతో 7,195 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఐదు వన్డేల్లో కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు.

జూన్ 2023లో ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆయన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా నిలిచింది. పుజారా, స్వదేశంలోనే కాక విదేశాల్లోనూ అనేక కీలక విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. “నయా వాల్” పేరుతో అభిమానులను ఆకట్టుకున్న ఈ సీనియర్ క్రికెటర్ రిటైర్మెంట్‌తో ఒక యుగానికి ముగింపు పలికినట్టే అయ్యింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గుర్తుపెట్టుకో.! 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆ ఇద్దరినీ ఎవరూ ఆపలేరు.!
టీమిండియాకి శనిలా దాపురించారు.! అదే జరిగితే మూడో వన్డేలోనూ టీమిండియా ఖేల్ ఖతం