
Bob Simpson: క్రికెట్ ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియన్ లెజెండరీ క్రికెటర్ బాబ్ సింప్సన్ (89) కన్నుమూశారు. ఆయన మృతిచెందిన విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ధృవీకరించింది. సింప్సన్ మృతి ఆస్ట్రేలియా క్రికెట్ లోకాన్ని తీవ్ర విషాదంలో ముంచింది.
బాబ్ సింప్సన్ 1957లో టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసి 1978 వరకు ఆస్ట్రేలియా తరపున 62 టెస్టులు ఆడారు. ఆయన కెరీర్ లో 4,869 పరుగులు చేయగా, అందులో 10 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. 1964లో మాంచెస్టర్ యాషెస్ టెస్టులో ఇంగ్లాండ్‌పై 311 పరుగులు చేసి, రికార్డు క్రియేట్ చేశారు. అలాగే ఆయన లెగ్ స్పిన్ బౌలింగ్‌తో 71 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు.
రిటైర్మెంట్ అనంతరం ఆస్ట్రేలియా జట్టుకు కోచ్‌గా మారి, ఒకప్పుడు కష్టాల్లో ఉన్న జట్టును కొత్త శిఖరాలకు చేర్చారు. వరుసగా నాలుగు యాషెస్ సిరీస్ విజయాలు (1989, 1990–91,1993, 1994–95)అందించారు.
అవార్డులు
1985లో స్పోర్ట్ ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్,
2006లో ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్
ప్రముఖుల నివాళి..
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్, “ఆటగాడిగా, కెప్టెన్‌గా, కోచ్‌గా ఆయన చేసిన సేవలు తరతరాల వరకు గుర్తుండిపోతాయి” అని నివాళులర్పించారు. క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ మైక్ బేయిర్ మాట్లాడుతూ, “సింప్సన్ లేకపోవడం ఆటకు తిరిగిరాని లోటు” అన్నారు. ఆయన గౌరవార్థం రోజు కైర్న్స్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌కు ముందు, ఆస్ట్రేలియా జట్టు ఒక నిమిషం మౌనం పాటించి, నల్ల చేతి బాండ్లు ధరించి నివాళులర్పించనుంది.