వరలక్ష్మీ వ్రత విధానం ఇదే..!

By telugu news team  |  First Published Aug 25, 2023, 10:17 AM IST

శ్రీమహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం పేరుతో వచ్చే మానం శ్రావణం. చాంద్రమాన ప్రకారం తెలుగు సంవత్సరాదిలో ఐదో నెల శ్రావణం. 


శ్రావణమాసం వచ్చేసింది. ఇది శ్రావణ మాసం రెండో శుక్రవారం. సాధారణంగా రెండో శుక్రవారాన్ని మనం వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటూ ఉంటారు.

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం భారతీయ హిందువుల సాంప్రదాయ  ఆచారంగా వస్తున్నది. వరలక్ష్మీ దేవత శ్రీ మహావిష్ణుమూర్తి గారి భార్య. శ్రీమహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం పేరుతో వచ్చే మానం శ్రావణం. చాంద్రమాన ప్రకారం తెలుగు సంవత్సరాదిలో ఐదో నెల శ్రావణం. 

Latest Videos

undefined

ఈ నెలలో నోములు, వ్రతాలు, పూజలకు ప్రశస్తి. ఈ పండగ ముత్తైదువలకు ఎంతో విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని అమ్మాయిలు కూడా పూజిస్తారు. ఈ అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, సంపద, భూమి, క్రమశిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. 


ఎందుకు ఈ వ్రతం చేస్తారు :- అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంటుంది. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం.

పురాణ గాధ ఏమిటి :- స్కందపురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేసాడంటారు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్షీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు, గౌరికి విశదపరచాడని పురాణ కథనం. దాంతో పార్వతీ దేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని పెద్దల మాట.

వరలక్ష్మీదేవి వ్రతం:- ఎవరైతే భక్తితో వేడుకుంటే కోరిన వరాలను ప్రసాదించే కల్పవల్లి వరలక్ష్మీ దేవి. శ్రీమహావిష్ణువు సహధర్మచారిణి లక్ష్మీదేవి అష్టావతారాలలో వరలక్ష్మీ దేవి ఒకరు. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన భక్తి , ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవలన లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది.


ఈ వ్రతాన్ని శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మీ వ్రతానికి ఆది దేవతయైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ముత్తైదువలందరూ చేసే  వ్రతం. ‘శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే’ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలిగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది.

వ్రత విధానం :- వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇళ్లును మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా గదిలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో లేదా రూపును తయారుచేసి అమర్చు కోవాలి. లక్ష్మి అమ్మవారి ఫోటోతో పాటు ఐశ్వర్య కాళీ అమ్మవారి పటం ఉన్నవారు పూజలో  పెట్టుకోవచ్చును, ఐశ్వర్య కాళీ అమ్మ వారు అంటే అష్ట లక్ష్ముల సమ్మేళనమే ఐశ్వర్య కాళీ అని గ్రహించండి, ఈ అమ్మవారు అత్యంత శక్తి వంతమైనది ఈ అమ్మవారి పటము ఉన్నవారు తప్పక పూజలో పెట్టండి. పూజాసామగ్రి, తోరం, అక్షతలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి.

తోరం తయారు చేసుకోవడం:- తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలను తయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.

గణపతి పూజ:- అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే ... వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥ ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥ అని స్తుతిస్తూ గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.

వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.

అనంతరం లక్ష్మీ అమ్మవారికి కలశం రూపంలో కొలుస్తారు. కలశంఏర్పాటు చేసుకొని కలశ పూజ చేయాలి.


వరలక్ష్మీ వ్రత కథ:- పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహార్షి ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమ శివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా నారదమహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయన్ని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి ప్రాణేశ్వరా! స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు.

అప్పుడు పార్వతీదేవి…దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది. కాత్యాయనీ…పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక పుణ్య స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతఃకాల గృహకృత్యాలను పూర్తిచేసుకుని అత్త,మామలను సేవలు చేస్తూ  తరించేంది.

వరలక్ష్మీ అమ్మవారి సాక్షాత్కారం:- వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ…ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు... నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. హే జననీ! నీకృపా కటాక్షాలు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకుకలిగింది’ అని పరిపరివిధాల వరలక్ష్మీని స్తుతించింది.

అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు. 

శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారాస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటుచేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే ! అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది.

అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి, భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేసారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు ఘల్లుఘల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణభూషితులయ్యారు.

వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి గజతురగరథ వాహనాలతో వచ్చి ఇళ్లకుతీసుకెళ్లారు. వారంతా మార్గ మధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మీవ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలుకలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు.

ఓ మునులారా… శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను. ఈ కథను విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి, భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి.

స్వచ్ఛమైన మనసుతో ఎవరికి తోచిన దాంట్లో వారు వరలక్ష్మీ అమ్మవారిని పూజించుకోవాలి. ఇలా చేయడం వల్ల వారి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు.

click me!