
భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికీ చావు అనేది చాలా సహజం. కానీ, ఆ మరణం ఎప్పుడు? ఎలా? ఎవరిని పలకరిస్తుందో తెలుసుకోవడం మాత్రం చాలా కష్టం. అయితే.. ఎవరు చనిపోతారు అనే విషయం మనకు తెలియకపోయినా.. చనిపోయే వ్యక్తికి మాత్రం కొన్ని గంటల ముందే తెలిసిపోతుందట. అలా తెలుసుకునేలా కొన్ని సంకేతాలు కనపడతాయట. ఈ విషయం మేం చెప్పడం లేదు.. గరుడ పురాణం చెబుతోంది.
మన హిందూ పురాణాల్లో గరుడ పురాణం కూడా చాలా కీలకమైనది. ఈ గరుడ పురాణంలో మరణం, మరణం తర్వాత జీవితం ఎలా ఉంటుంది అనే విషయాలను క్షుణ్ణంగా వివరించారు. దానిలో పేర్కొన్న దాని ప్రకారం మరణానికి దగ్గరపడిన వ్యక్తికి కొన్ని సంకేతాలు కనపడతాయట. మరి, అవేంటో తెలుసుకుందామా..
గమనిక: ఇది కేవలం పురాణాలలో ఉన్న విషయాన్ని ఆధారం చేసుకొన్ని ఇస్తున్న సమాచారం మాత్రమే. ఇది పూర్తిగా నిజం అని మేము ధ్రువీకరించడం లేదు.
ముత్తాతలు ఏడవడం
ప్రాణం పోయే సమయంలో, ఆ వ్యక్తి గొంతు బొంగురు పోతుంది, మాట్లాడాలని ప్రయత్నించినా మాట రాదు. ఎవరో గొంతు పిసికినట్టుగా గొంతులో గరగర శబ్దం వస్తుంది. గరుడ పురాణం ప్రకారం, ముత్తాతలు చావుకి కొన్ని రోజుల ముందు కలలో కనిపిస్తారు. ముత్తాతలు కలలో ఏడుస్తున్నట్టుగా లేదా బాధపడుతున్నట్టుగా కనిపిస్తే, ఆ వ్యక్తి మరణానికి దగ్గరపడుతున్నట్లు అర్థం.
పాత జ్ఞాపకాలు గుర్తుకు రావడం
ఏ వ్యక్తి అయినా చావుకి ముందు తన జీవితంలో జరిగిన పాత విషయాలని గుర్తు చేసుకుంటాడట. దాని ద్వారా తను చేసిన మంచి, చెడు పనులని గుర్తు చేసుకుంటాడని చెబుతారు. చావు దగ్గర పడుతున్నప్పుడు తను చేసిన చెడు పనులన్నీ గుర్తుకొస్తాయట. తన పాప పుణ్యాల గురించి ఆలోచిస్తాడట.
నీడ కనిపించకపోవడం
ఏ వ్యక్తికైనా నీళ్ళలో, నూనెలో, అద్దంలో నీడ కనిపించకపోతే లేదా వాళ్ళ నీడ వంకరగా కనిపిస్తే, వాళ్ళు చావుకి దగ్గరగా ఉన్నారని అర్థం. చావుకి కొంత సమయం ముందు ఈ సంకేతాలన్నీ యమధర్మరాజు నుండి వస్తాయని గరుడ పురాణం చెబుతోంది.
ప్రకాశవంతమైన వెలుతురు కనిపించడం
చావు దగ్గర పడుతున్నప్పుడు, ఆ వ్యక్తికి కళ్ళు సరిగ్గా కనిపించవు. చుట్టూ ఉన్న వాళ్ళని కూడా చూడలేడు. కానీ, ఎవరైతే తన జీవితంలో మంచి పనులు చేశారో, వాళ్ళకి చావు సమయంలో ప్రకాశవంతమైన వెలుతురు కనిపిస్తుంది. అలాంటి వాళ్ళు చావు వచ్చినప్పుడు భయపడరు.
యమదూతలు కనిపించడం
చావు దగ్గర పడుతున్నప్పుడు, ఇద్దరు యమదూతలు చనిపోతున్న వ్యక్తి ముందు వచ్చి నిలబడతారని గరుడ పురాణంలో చెప్పారు. ఎవరైతే తన జీవితంలో చెడు పనులు చేశారో, వాళ్ళు ఈ యమదూతలని చూసి భయపడతారు.
ఇవి కూడా కనిపించవచ్చు
తల వెంట్రుకలు తెల్లబడటం, పళ్ళు విరగడం, కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, శరీర అవయవాలు సరిగ్గా పనిచేయకపోవడం కూడా చావుకి ముందు సంకేతాలు కావచ్చు.
అరచేతి రేఖలు మాయం
చావుకి ముందు అరచేతిలో ఉన్న రేఖలు కూడా ఆ వ్యక్తికి సరిగ్గా కనిపించవు. చావు దగ్గర పడుతున్నప్పుడు ఆ వ్యక్తి తికమకగా మాట్లాడతాడట. గరుడ పురాణం ప్రకారం, ఏ వ్యక్తి అయినా చనిపోయేటప్పుడు ఒక మర్మమైన ద్వారం చూస్తాడట. కొంతమంది మంటలు చూస్తారట.
గరుడ పురాణం చాలా కాలం క్రితం రాసిన పురాణం. అందులో ఈ సంకేతాల గురించి చెప్పారు. ఇవి పూర్తిగా నిజాలు అని మేము నిర్దారించడం లేదు.