Ganesh Chaturthi - 2022: సాధారణంగా ఏదైనా పండుగలు వస్తున్నాయంటే పెద్ద ఎత్తున పిండివంటలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం చేస్తుంటాము. అయితే కొన్ని ప్రాంతాలలో ఒక్కోరకమైన నైవేద్యాలను తయారు చేస్తుంటారు.
ఇకపోతే దగ్గరలోనే వినాయక చవితి పండుగ ఉన్న సందర్భంగా గణపయ్యకు ఇష్టమైన పిండివంటలను నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆ గణనాథుని అనుగ్రహం మనపై ఉంటుంది. ఈ విధంగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన కొబ్బరి లడ్డులు ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం...
కావలసిన పదార్థాలు: చీకటి పాలు అర లీటరు, పంచదార అరకిలో, పచ్చి కొబ్బరి తురుము ఆరు కప్పులు, యాలకుల పొడి రెండు టేబుల్ స్పూన్లు, జీడిపప్పు గుప్పెడు, నెయ్యి కొద్దిగా
తయారు చేసే విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకొని టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు వేయించి పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో అర లీటరు పాలు,పంచదార, కొబ్బరి తురుము వేసి చిన్న మంటపై ఈ మిశ్రమం చిక్కపడే వరకు వేయిస్తూ ఉండాలి.ఇలా ఈ మిశ్రమం చిక్కగా అవుతున్న సమయంలో స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక వెడల్పాటి ప్లేట్లో నెయ్యి పోసి ఆ మిశ్రమం మొత్తం అందులోకి వేయాలి. చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఆ కొబ్బరి మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూలుగా తయారుచేసి దానిపై ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులను అలంకరించుకోవాలి. ఇలా రుచికరమైన కొబ్బరి లడ్డులను ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు.