Fasting Benefits: ఉపవాసం ఉంటే దేవుడు కోరికలు తీరుస్తాడని చాలా మంది ఆకలిని చంపుకొని ఫాస్టింగ్ చేస్తారు. కాని ఉపవాసం చేయడం వెనుక ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా హిందూ మతంలో ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అసలు ఫాస్టింగ్ ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? శారీరకంగా, మానసికంగా ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం రండి.
ప్రపంచంలోని అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ఉపవాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. భగవద్గీత కూడా ఆహారం విషయంలో మితంగా ఉండమని (18.52) చెబుతోంది. ఉపవాసం కష్టంగా అనిపించినా, దాని వల్ల చాలా లాభాలు ఉన్నాయంటున్నారు డాక్టర్లు. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా అనేక మతాలు ఉపవాసాలను ప్రోత్సహిస్తాయి. అయితే కొన్నిచోట్ల దేవుడి అనుగ్రహం పొందడానికి ఉపవాసం ఉంటున్నామని చెబుతుంటారు. కాని దాని వెనుక దాగున్నది మాత్రం మనిషి ఆరోగ్యమే. ఫాస్టింగ్ చేస్తే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ఉపవాసం అంటే ఒక ప్రత్యేక సమయం వరకు ఆహారం తినకుండా ఉండాలని ఒక నిర్ణయం తీసుకోవడం. ఉపవాసం ఎందుకుండాలి, ఎలా ఉండాలన్న విషయాలను హిందూ గ్రంథాల్లో వివరించారు. పురాణాలు, ఇతర పవిత్ర గ్రంథాల్లో ఉపవాసం వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలను తెలియజేస్తూ చాలా కథలు కూడా ఉన్నాయి. అయితే ఆధునిక సైన్సు ఉపవాసం వల్ల కలిగే మానసిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలను గుర్తించింది.
హిందూ గ్రంథాల ప్రకారం ఉపవాసం అనేది వ్యక్తి ఆత్మకు, దేవుడికి మధ్య సంబంధాన్ని బలపరుస్తుంది. హిందువులు శతాబ్దాలుగా వివిధ పండగల్లో ఉపవాసం చేస్తున్నారు. దీని వల్ల ఆధ్యాత్మిక అవగాహనను పెంచడం, దేవుడితో దగ్గరి సంబంధాన్ని ఏర్పరచుకోవడం లాంటి ఎన్నో ప్రయోజనాలను వారు పొందుతున్నారు. ఉపవాసం ద్వారా మనస్సు, శరీరం రెండూ శుద్ధి అవుతాయి. ఉపవాసం వెనుక మరో దాగి ఉన్న విషయం ఏంటంటే మతపరమైన పండుగలు, ఆచారాలను కొనసాగించేలా చేయడం.
హిందూమతంలో ఉపవాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. జీవాత్మ (వ్యక్తిగత ఆత్మ) సహజంగానే ప్రపంచ కోరికలకు ఆకర్షితమవుతుంది. దీనివల్ల ఆధ్యాత్మికంగా ఎదగడం కష్టమవుతుందని చాలా మంది నమ్ముతారు. మనస్సును అదుపులో ఉంచుకోవడానికి, సమాజంలో జరుగుతున్న విషయాల నుండి దృష్టి మరల్చడానికి, ఉపవాసం ఒక ముఖ్యమైన సాధన. దేవుళ్ల ఆశీర్వాదాలు పొందడానికి చేసే ఒక పవిత్రమైన పని ఉపవాసం. భక్తులు ఆహారాన్ని త్యాగం చేసి, విశ్వాసం, భక్తితో ఆకలిని భరిస్తారు. దీని వల్ల మనసు, శరీరం అదుపులో ఉంటాయి.
మహాభారతంలో సెక్షన్ 103,.. భీష్ముడు యుధిష్ఠిరుడికి ఆహారం తీసుకోకుండా ఉండటం అత్యుత్తమమైన ప్రాయశ్చిత్తాల్లో ఒకటని, ఈ శక్తివంతమైన వ్రతాన్ని అనుసరించమని ప్రోత్సహిస్తాడు.
శ్రీమద్ భాగవతం (12:12:60) ప్రకారం ఏకాదశి లేదా ద్వాదశి రోజున భాగవతం వినడం వల్ల ఎక్కువ కాలం జీవించవచ్చు. ఉపవాసం ఉండి చదివితే గత పాపాలన్నీ తొలగిపోతాయి.
ఉపవాసం ఒక ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదు. దీనికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని పురాతన, ఆధునిక వైద్య శాస్త్రాలు గుర్తించాయి. ఆయుర్వేదం ప్రకారం జీర్ణవ్యవస్థలో విష పదార్థాలు పేరుకుపోవడం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయి. ఉపవాసం వల్ల జీర్ణ అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. శరీరం తనను తాను శుద్ధి చేసుకుని, సహజ ప్రక్రియలను పునరుద్ధరించుకుంటుంది. ఒక రోజు పూర్తి ఉపవాసం ఉండటం ఆరోగ్యానికి చాలా మంచిది.
షుగర్ కంట్రోల్ ఉంటుంది: ఉపవాసం ఉండటం టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుందని వైద్య పరిశోధనల్లో గుర్తించారు. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం ద్వారా జీవక్రియను మెరుగుపరుస్తుంది.
గుండె జబ్బులు తగ్గుతాయి: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణం. ప్రకృతి వైద్యంలో ఉన్నట్టుగా ఉపవాసం ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గుతుంది.
శరీరానికి ఎంతో మంచిది: ఉపవాసం వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. ఎక్కువ కాలం జీవించవచ్చు. ఇది హ్యూమన్ గ్రోత్ హార్మోన్ (HGH) స్థాయిలను పెంచుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. కండరాలను బలోపేతం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి హోలీ పండగ మార్చి 14న? 15న? పూర్తి వివరాలతో క్లారిటీ ఇదిగో?