
పిల్లలు పక్క తడపడం అనేది చాలా ఇళ్లలో చూసే సాధారణ సమస్య. దీన్ని ఒక జబ్బుగా చూడాల్సిన పనిలేదు. చాలాసార్లు వయసు పెరిగే కొద్దీ ఈ అలవాటు దానంతట అదే పోతుంది. బ్లాడర్ పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం, గాఢ నిద్ర, హార్మోన్ల మార్పులు, మానసిక ఒత్తిడి లేదా మలబద్ధకం వంటివి దీనికి కారణాలు కావచ్చు.
కేవలం చిన్న పిల్లలే కాదు, టీనేజ్‌లోకి వచ్చిన కొందరిలో కూడా నిద్రలో తెలియకుండానే పక్క తడిపే అలవాటు ఉంటుంది. చాలామంది విషయంలో దీనికి సరైన కారణం ఏంటో స్పష్టంగా తెలియదు. కానీ, అనుకోకుండా జరిగే ఈ పని వల్ల పిల్లలు ఇబ్బందిగా ఫీలవుతారు. వాళ్లలో సిగ్గు, నలుగురిలో కలవలేకపోవడం, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి సమస్యలు వస్తాయి.
ఆరేళ్లు దాటిన తర్వాత కూడా ఒక పిల్లవాడు వారానికి రెండుసార్ల కంటే ఎక్కువగా పక్క తడుపుతుంటే, ఆ పరిస్థితిని డాక్టర్లు 'నాక్టర్నల్ ఎన్యూరెసిస్' (nocturnal enuresis) అంటారు. చాలామంది తల్లిదండ్రులు, పిల్లలు బద్ధకంతోనో, టాయిలెట్‌కు వెళ్లడానికి ఇబ్బందిపడో కావాలనే పక్క తడుపుతున్నారని అపార్థం చేసుకుంటారు. కానీ నిజానికి ఇది వాళ్లు కావాలని చేసేది కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్లే ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు ఏదైనా నొప్పి లేదా లోపల ఉన్న అనారోగ్య సమస్యలు కూడా దీనికి కారణం కావచ్చు.
ప్రధానంగా రెండు రకాల పిల్లల్లో ఈ సమస్య కనిపిస్తుంది. మొదటి రకం, తమ బ్లాడర్‌పై అస్సలు కంట్రోల్ లేనివాళ్లు. రెండో రకం, బ్లాడర్‌ను కంట్రోల్ చేసుకోగలరు కానీ, ఆ సమయంలో నిద్రలో ఉండటం వల్ల కంట్రోల్ కోల్పోయేవారు.