
పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదిగే కీలకమైన దశలో ఉంటారు. వాళ్ల పూర్తి ఆరోగ్యానికి సరైన పోషకాహారం చాలా ముఖ్యం. మనం పెట్టే తిండి వాళ్ల చదువు, రోగనిరోధక శక్తి, రోజంతా ఉండే ఉత్సాహంపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు విటమిన్లు, మినరల్స్ లాంటివి కూడా వాళ్ల డైట్‌లో ఉండేలా చూసుకోవాలి. పిల్లల ఎదుగుదలకు, ముఖ్యంగా మెదడు పనితీరుకు అవసరమైన ఏడు ముఖ్యమైన పోషకాలేంటో చూద్దాం.
శరీర కణజాలాల నిర్మాణానికి, దెబ్బతిన్న వాటిని బాగు చేయడానికి ప్రొటీన్ చాలా అవసరం. కండరాల ఎదుగుదలకు కూడా ఇది సాయపడుతుంది. అందుకే రోజూ తినే ఆహారంలో గుడ్లు, పాలు, పాల పదార్థాలు, పప్పులు ఉండేలా చూసుకోవాలి.
ఆరోగ్యకరమైన కొవ్వులు
నట్స్, విత్తనాలు, చేపల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు ఎదుగుదలకు చాలా కీలకం. ఇవి పిల్లల జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి.
ఐరన్
పిల్లల తెలివితేటలు పెరగడానికి ఐరన్ చాలా ముఖ్యమైన పోషకం. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సాయపడి, మెదడుకు ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఐరన్ లోపిస్తే పిల్లలు నీరసంగా ఉంటారు, దేనిపైనా సరిగ్గా దృష్టి పెట్టలేరు, చదువులో వెనకబడతారు. ఆకుకూరలు, బెల్లం, పప్పుధాన్యాలు, పోషకాలు కలిపిన తృణధాన్యాలు తినిపిస్తే ఐరన్ లోపం రాకుండా చూసుకోవచ్చు.
కాల్షియం, విటమిన్ డి
ఎముకలు, పళ్లు బలంగా ఉండాలంటే కాల్షియం, విటమిన్ డి తప్పనిసరి. పాలు, పెరుగు, చీజ్ లాంటివి పిల్లలకు ఇవ్వాలి. ఇక బి-విటమిన్లు శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు మెదడు పనితీరుకు సపోర్ట్ చేస్తాయి. దీంతో పిల్లలు రోజంతా యాక్టివ్‌గా, చురుగ్గా ఉంటారు.
కార్బోహైడ్రేట్లు
గోధుమలు, ఓట్స్, రాగులు, బ్రౌన్ రైస్ లాంటి పొట్టు తీయని ధాన్యాలు రోజంతా కావాల్సిన శక్తిని అందిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి, స్కూల్ టైమ్‌లో పిల్లలు నీరసించిపోకుండా చూస్తాయి.
సూక్ష్మ పోషకాలు (మైక్రోన్యూట్రియెంట్స్)
జింక్, విటమిన్ సి లాంటివి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తరచూ వచ్చే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా పిల్లలను కాపాడతాయి. దీనివల్ల వాళ్లు స్కూల్‌కు డుమ్మా కొట్టకుండా ఉంటారు. నారింజ లాంటి పండ్లు, నట్స్, విత్తనాలు, పప్పులు ఆహారంలో చేర్చడం మంచిది.
అయోడిన్
థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయాలన్నా, మెదడు ఎదుగుదల బాగుండాలన్నా అయోడిన్ అవసరం. దీన్ని చాలామంది పెద్దగా పట్టించుకోరు. వంటలో అయోడిన్ ఉన్న ఉప్పు వాడితే ఈ లోపం రాకుండా చూసుకోవచ్చు. అలాగే, విటమిన్ ఎ కంటిచూపును, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.